Ramadugu: యువత ఉన్నత లక్ష్యాలను సాధించాలి: తహసీల్దార్ రాజమల్లు!

Ramadugu: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిరే ఎక్స్ రోడ్ వద్ద స్వామి వివేకానంద వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి.

N. Madhusudan Reddy, Karimnagar
Published on: 4 July 2026 5:08 PM IST
Ramadugu
X

Ramadugu: యువత ఉన్నత లక్ష్యాలను సాధించాలి: తహసీల్దార్ రాజమల్లు!

రామడుగు: దేశ ఔన్నత్యాన్ని ప్రపంచ నలుదిశలా చాటిచెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద అని, నేటి యువత ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని సాధించేందుకు కృషి చేయాలని రామడుగు మండల తహసీల్దార్ దాసరి రాజమల్లు పిలుపునిచ్చారు.

స్వామి వివేకానంద వర్ధంతి సందర్భంగా జాతీయ యువజన అవార్డు గ్రహీత అలువాల విష్ణు ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిరే ఎక్స్ రోడ్ వద్ద స్వామి వివేకానంద విగ్రహానికి ప్రజాప్రతినిధులు, అధికారులు, యువకులు, గ్రామ ప్రజలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా తహసీల్దార్ దాసరి రాజమల్లు మాట్లాడుతూ, స్వామి వివేకానందుడు స్వల్పకాలం మాత్రమే జీవించినప్పటికీ ఆయన చూపిన దార్శనికత, ఆలోచనలు, వ్యక్తిత్వ వికాస సందేశాలు నేటికీ ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచాయని అన్నారు. యువత సన్మార్గంలో పయనిస్తూ సమాజ అభివృద్ధికి తమ వంతు పాత్ర పోషించాలని సూచించారు.

సర్పంచుల సంఘం గౌరవ అధ్యక్షులు ఉప్పుల అంజనీ ప్రసాద్, రామడుగు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జవ్వాజీ హరీష్ మాట్లాడుతూ, స్వామి వివేకానంద భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతను విశ్వవ్యాప్తంగా చాటిచెప్పిన మహనీయుడని కొనియాడారు. యువత ఆయన బోధనలను ఆదర్శంగా తీసుకొని వ్యక్తిత్వ వికాసం సాధించాలని సూచించారు. అలాగే స్వామి వివేకానంద జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేలా ఎమ్మెల్యే, మంత్రుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.

జిల్లా యువజన సంఘాల సమితి అధ్యక్షులు, రేవెల్లి గ్రామ సర్పంచ్ బంధరపు అజయ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, వ్యక్తిత్వాన్ని కోల్పోతే సర్వస్వాన్ని కోల్పోయినట్టేనని అన్నారు. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్రమంత మనసు కలిగిన యువతే దేశ భవిష్యత్తును మార్చగలరని స్వామి వివేకానంద సందేశాన్ని గుర్తు చేశారు.

జాతీయ యువజన అవార్డు గ్రహీత అలువాల విష్ణు మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం వెంటనే రాష్ట్రానికి నూతన యువజన విధానాన్ని ప్రకటించాలని, యువజన సంఘాలను బలోపేతం చేయాలని, అలాగే స్వామి వివేకానంద జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ శనిగరపు అంజన్ కుమార్, ఎంపీడీవో సంగీ రాజేశ్వరి, ఏపీఎం జ్యోతి, ఉప సర్పంచులు రాజిరెడ్డి, కటకం మనీష్, పంచాయతీ కార్యదర్శి మల్లికార్జున్, పంచాయతీ కారోబార్ పన్యాల అశోక్ రెడ్డి, వివిధ రాజకీయ పార్టీల నాయకులు కొడిమ్యాల రాజేశం, నేరెళ్ల మారుతి గౌడ్, యువజన సంఘాల నాయకులు కొలిపాక కమలాకర్, అలువాల శంకర్, జవ్వాజీ అజయ్, కొల్లూరి అనిల్, కిరణ్ తేజ, కొలిపాక ప్రవీణ్, గడ్డం అంజయ్య, నల్ల శ్రీనివాస్, కె. కమలాకర్, కొలిపాక కార్తీక్, దాసరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

N. Madhusudan Reddy, Karimnagar

N. Madhusudan Reddy, Karimnagar

Next Story