Ramagundam: రామగుండంలో వరద ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్

Ramagundam: రామగుండంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యేతో కలిసి కలెక్టర్ కోయ శ్రీహర్ష పర్యటన. బాధితులకు తక్షణ సహాయక చర్యలు అందించాలని అధికారులకు ఆదేశం.

VIJAY, RAMAGUNDAM
Published on: 30 July 2026 8:29 PM IST
Ramagundam
X

Ramagundam: రామగుండంలో వరద ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్

రామగుండం: పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను మరింత వేగవంతం చేసి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు.

రామగుండం మున్సిపల్ పరిధిలోని 21వ డివిజన్ వీర్లపల్లి, ఓ.సి.పి - 3 ఏరియా,25వ డివిజన్ వరద ప్రభావిత ప్రాంతాలను రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్‌, మున్సిపల్ కమిషనర్ రామగుండం తో కలిసి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వరద పరిస్థితులను, నీటి నిల్వను, ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ, ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో వరదల సమయంలో నీరు ఇళ్లలోకి ప్రవేశించకుండా ఆర్‌ఎఫ్‌సీఎల్ యాజమాన్యం తక్షణమే అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కార చర్యలను రూపొందించాలని ఆదేశించారు.

ఓసీ-3 ప్రాంతంలో నిలిచిపోయిన వరద నీటిని యంత్రాల సహాయంతో అత్యంత వేగంగా తొలగించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నీటి నిల్వల వల్ల ఎలాంటి ప్రమాదాలు తలెత్తకుండా నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు.

ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద ప్రవాహాలు వచ్చే అవకాశం ఉన్నందున అన్ని శాఖల అధికారులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజలకు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూ, ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లకుండా అవగాహన కల్పించాలని, అవసరమైనచోట సహాయక బృందాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు, పారిశుద్ధ్య పనులు, తాగునీటి సరఫరా, విద్యుత్ సరఫరా వంటి మౌలిక సేవల్లో ఎలాంటి అంతరాయం కలగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ పర్యటనలో సంబంధిత శాఖల అధికారులు, మున్సిపల్ అధికారులు, ఆర్‌ఎఫ్‌సీఎల్ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

VIJAY, RAMAGUNDAM

VIJAY, RAMAGUNDAM

Next Story