Ramagundam: నేరాల నియంత్రణలో నిర్లక్ష్యం వద్దు సీపీ అంబర్ కిషోర్ ఝా
Ramagundam: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతలు, నేరాల నియంత్రణ, రౌడీషీటర్లపై నిఘా మరియు పెండింగ్ కేసులపై అధికారులతో సమీక్షించిన సీపీ అంబర్ కిషోర్ ఝా.
Ramagundam: నేరాల నియంత్రణలో నిర్లక్ష్యం వద్దు సీపీ అంబర్ కిషోర్ ఝా
రామగుండం: నేరాల నియంత్రణకు పోలీస్ అధికారులు తమ సమాచార వ్యవస్థను మరింత పటిష్టం చేసుకోవాలని,తమ పరిధిలో జరిగే ప్రతి ముఖ్యమైన ఘటనపై తక్షణమే స్పందిస్తూ,నేరాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు.
కమిషనరేట్ కార్యాలయంలో గురువారం మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల పోలీస్ అధికారులతో నేరాల నియంత్రణ, శాంతిభద్రతలు, పెండింగ్ కేసులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యలు,నేర పరిశోధన తదితర అంశాలపై సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లాల వారీగా, పోలీస్ స్టేషన్ల వారీగా పరిస్థితులను సీపీ సమీక్షించారు.ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసుల ప్రస్తుత స్థితి, దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసులు, నిందితుల అరెస్టు, చార్జిషీట్‌ల దాఖలు, సాక్ష్యాధారాల సేకరణ,కోర్టు కేసుల పురోగతి, నేరాల నియంత్రణకు చేపడుతున్న చర్యలు, ఎన్‌ఫోర్స్‌మెంట్ కేసుల నమోదు తదితర అంశాలపై ఎస్‌హెచ్‌ఓలను అడిగి తెలుసుకున్నారు.
ప్రతి ఘటనపై తక్షణ స్పందన అవసరం
సీపీ మాట్లాడుతూ ప్రతి పోలీస్ స్టేషన్ అధికారి ప్రజలకు అందుబాటులో ఉంటూ,నిజాయితీ, నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని సూచించారు.తమ పరిధిలో జరిగే ప్రతి ముఖ్యమైన సంఘటనపై ముందస్తు అవగాహనతో పాటు సమగ్ర సమాచారం కలిగి ఉండాలని అన్నారు. ఉన్నతాధికారుల నుంచి వచ్చే సమాచారంపై వెంటనే స్పందించాలని, సమస్య పెద్దదిగా మారిన తర్వాత వివరణ ఇచ్చే పరిస్థితి రాకుండా ముందస్తు అంచనా, సమన్వయం,తక్షణ స్పందన, సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ముందస్తు సమాచారం అందినప్పటికీ సమర్థవంతంగా స్పందించకపోవడం అధికారుల పనితీరు, పర్యవేక్షణపై ప్రతికూల ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. ఏదైనా సమస్యపై సమాచారం అందిన వెంటనే సంబంధిత అధికారులు స్వయంగా పర్యవేక్షించి, అవసరమైన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.
రౌడీషీటర్లు, అసాంఘిక శక్తులపై ప్రత్యేక నిఘా
ప్రతి ఎస్‌హెచ్‌ఓ,సీఐ తమ పరిధిలోని శాంతిభద్రతలు, నేరాలు, సున్నితమైన ప్రాంతాలు, రౌడీషీటర్లు, అసాంఘిక శక్తులు, సమస్యాత్మక వ్యక్తులు తదితర అంశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సీపీ సూచించారు. ప్రతి పోలీస్ స్టేషన్‌లో ముఖ్యమైన అంశాలపై ప్రత్యేక పర్యవేక్షణ జాబితా నిర్వహిస్తూ,ఎవరిపై వ్యక్తిగతంగా శ్రద్ధ అవసరం,ఏ సమస్యలను కింది స్థాయి అధికారుల ద్వారా పరిష్కరించవచ్చు అనే అంశాలను నిరంతరం సమీక్షించాలన్నారు.
రౌడీషీటర్లు, అసాంఘిక శక్తుల కార్యకలాపాలను వారి రాజకీయ లేదా ఇతర అనుబంధాలతో సంబంధం లేకుండా నిష్పక్షపాతంగా, నిశితంగా పరిశీలించాలని ఆదేశించారు. ముఖ్యంగా ప్రాపర్టీ సంబంధిత నేరాలు, శారీరక దాడులు, బెదిరింపులు,అక్రమ కార్యకలాపాలు వంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. అవసరమైన చోట ఆకస్మిక తనిఖీలు, కౌన్సెలింగ్ నిర్వహిస్తూ వారి కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని తెలిపారు.
పర్యవేక్షణ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి
పర్యవేక్షణ అధికారులు కేవలం కార్యాలయాలకు పరిమితం కాకుండా పగలు,రాత్రి వేళల్లో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ తమ పరిధిలోని వాస్తవ పరిస్థితులను స్వయంగా అంచనా వేయాలని సీపీ సూచించారు. ఎస్‌హెచ్‌ఓలకు నిరంతరం మార్గనిర్దేశం చేస్తూ, పోలీస్ స్టేషన్ల రోజువారీ పనితీరు, కేసుల దర్యాప్తు, పెండింగ్ కేసులు, నేరాల పరిస్థితి, ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యలను క్రమం తప్పకుండా సమీక్షించాలని ఆదేశించారు.
సమస్య తలెత్తిన తర్వాత బాధ్యత నుంచి తప్పించుకునే ధోరణి కాకుండా, సమస్యను ముందుగానే గుర్తించి పరిష్కరించే బాధ్యత ప్రతి అధికారిపై ఉందని సీపీ స్పష్టం చేశారు.
పెండింగ్ కేసుల త్వరిత పరిష్కారం
పెండింగ్ కేసులను నిరంతరం సమీక్షిస్తూ, దర్యాప్తులో నాణ్యతను పెంచి, కేసులను త్వరితగతిన పరిష్కరించాలని సీపీ ఆదేశించారు.
నిందితుల అరెస్టు, సాక్ష్యాధారాల సేకరణ,సాంకేతిక ఆధారాల వినియోగం, చార్జిషీట్‌ల దాఖలు తదితర అంశాల్లో జాప్యం ఉండకూడదన్నారు. ప్రతి కేసులో దర్యాప్తు అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించి, కోర్టులో నేర నిరూపణకు అవసరమైన పటిష్టమైన సాక్ష్యాధారాలను సేకరించాలని సూచించారు.
ఎన్‌ఫోర్స్‌మెంట్ కేసులపై ప్రత్యేక దృష్టి
ఈ-పెట్టీ కేసులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ కేసుల నమోదు, పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీపీ ఆదేశించారు. చిన్నపాటి ఉల్లంఘనలను కూడా నిర్లక్ష్యం చేయకుండా చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని తెలిపారు.చట్టాన్ని ఉల్లంఘించే వారిపై సకాలంలో చర్యలు తీసుకోవడం ద్వారా ప్రజల్లో చట్టంపై గౌరవం పెరగడంతో పాటు నేరస్థుల్లో భయం ఏర్పడుతుందని అన్నారు.
డ్రంక్ అండ్ డ్రైవింగ్‌పై ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని, నిరంతర తనిఖీలు నిర్వహిస్తూ,రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.
ఎన్‌డీపీఎస్ కేసుల్లో సరఫరా నెట్‌వర్క్‌పై దర్యాప్తు
ఎన్‌డీపీఎస్ కేసుల్లో తక్కువ పరిమాణంలో గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాలు పట్టుబడినా కేసు నమోదు చేసి,వాటి వెనుక ఉన్న సరఫరా వ్యవస్థ,ప్రధాన సరఫరాదారులు, మధ్యవర్తులు, వినియోగదారుల నెట్‌వర్క్పై లోతైన దర్యాప్తు చేపట్టాలని సీపీ ఆదేశించారు. నిందితులు ఇతర రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ వారి సంబంధాలను గుర్తించి,సంబంధిత రాష్ట్రాల పోలీసులతో సమన్వయం చేసుకుని చట్టపరమైన చర్యలు తీసుకునేలా ప్రత్యేక బృందాలను సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు.
అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు
కమిషనరేట్ పరిధిలో అక్రమ రవాణా,గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా, పేకాట,రేషన్ బియ్యం అక్రమ రవాణా,పశువుల అక్రమ రవాణా, ఇసుక అక్రమ రవాణా తదితర చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, నిరంతరం ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యలు చేపట్టాలని సీపీ ఆదేశించారు.
ప్రతి పోలీస్ అధికారి తన పరిధిపై పూర్తి అవగాహన కలిగి ఉండటంతో పాటు, సమస్యాత్మక ప్రాంతాలు, నేరాలకు అవకాశం ఉన్న ప్రదేశాలు,నేరస్థుల కదలికలు, అక్రమ కార్యకలాపాలపై ముందస్తు సమాచార వ్యవస్థను బలోపేతం చేసుకోవాలని సూచించారు.
కేవలం క్షేత్రస్థాయిలో తిరగడం కాదు.. సమస్యను ముందుగానే గుర్తించాలి
పోలీస్ అధికారులు కేవలం క్షేత్రస్థాయిలో పర్యటించడం మాత్రమే తమ విధి కాదని,అక్కడి సమస్యలను ముందుగానే గుర్తించి,వాటికి పరిష్కారం చూపే ఆలోచనా విధానం, బాధ్యతాయుతమైన పనితీరు, సమర్థవంతమైన పర్యవేక్షణ ప్రతి అధికారిలో ఉండాలని సీపీ స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్,పెద్దపల్లి డీసీపీ బి.రామ్‌రెడ్డి, అడిషనల్ డీసీపీ (అడ్మిన్) కె.శ్రీనివాస్, గోదావరిఖని ఏసీపీ ఎం.రమేష్, పెద్దపల్లి ఏసీపీ జి.కృష్ణ, మంచిర్యాల ఏసీపీ ఆర్.ప్రకాశ్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, బెల్లంపల్లి ఎసిపి కిరణ్ కుమార్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేంద్ర గౌడ్, ట్రాఫిక్ ఏసీపీ సి.హెచ్.శ్రీనివాస్, టాస్క్‌ఫోర్స్, ఏసీపీ శ్రీనివాస్‌రావు, సైబర్ క్రైమ్ డిఎస్పీ రంగారెడ్డి,ఏఆర్ ఏసీపీ రమేష్ తో పాటు ఇతర సీఐలు, ఇన్‌స్పెక్టర్లు, ఆర్‌ఐలు,ఎస్‌ఐలు పాల్గొన్నారు.




