Ramagundam: రామగుండం 100 పడకల ఈ.ఎస్.ఐ ఆస్పత్రిని నిర్మించాలి

Ramagundam: రామగుండంలో ఈ.ఎస్.ఐ ఆస్పత్రి నిర్మాణం కోసం సంతకాల సేకరణ. 8 ఏళ్లుగా నిధులు ఉన్నా స్థల సేకరణలో జాప్యంపై కార్మిక సంఘాల ఆగ్రహం. వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్.

VIJAY, RAMAGUNDAM
Published on: 17 July 2026 5:09 PM IST
Ramagundam
X

Ramagundam: రామగుండం 100 పడకల ఈ.ఎస్.ఐ ఆస్పత్రిని నిర్మించాలి

రామగుండం: పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో 100 పడకల ఈ.ఎస్.ఐ ఆస్పత్రి నిర్మాణం కోసం 2018లోనే కేంద్ర ప్రభుత్వం సుమారు రూ.150 కోట్లు మంజూరు చేసిందని, అయినప్పటికీ 8 సంవత్సరాలు గడిచినా స్థల సేకరణ, నిర్మాణంలో పూర్తిగా నిర్లక్ష్యం జరుగుతోందని స్వచ్చంద సంఘాల ఐక్య వేదిక ఆరోపించింది. శుక్రవారం రోజున వేదిక ఆధ్వర్యంలో ప్రధాన చౌరస్తాలో సంతకాల సేకరణ నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా స్వచ్చంద సంఘాల నాయకులు మద్దెల దినేష్, అయిత శివకుమార్, గోలివాడ చంద్రకళ మాట్లాడుతూ ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యం వల్ల ఆస్పత్రి స్థల సేకరణ , నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ.ఎస్.ఐ ఆస్పత్రి నిర్మాణం కాకపోవడంతో అసంఘటిత రంగంతో పాటు లక్షలాది కార్మికులకు వైద్య సేవలు దూరమవుతున్నాయని, వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు.

రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో వివిధ పరిశ్రమలలో పనిచేస్తున్న అసంఘటిత కార్మికులకు ఇప్పటికీ పూర్తిస్థాయి ఈ.ఎస్.ఐ ఆస్పత్రి అందుబాటులోకి రాకపోవడం ప్రభుత్వాల, అధికార యంత్రాంగ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు.

కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించినా జిల్లా స్థాయిలో స్థల సేకరణలో జాప్యం కారణంగా వేలాది మంది కార్మికులు నేటికీ నాణ్యమైన వైద్య సేవలకు దూరమవుతున్నారని పేర్కొన్నారు. 2028 జనవరి 31 లోపు డిపిఆర్ తయారు చేసి నిర్మాణం ప్రారంభించకుంటే నిధులు వెనక్కి పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

ఈ.ఎస్.ఐ ఆస్పత్రి నిర్మాణాన్ని తక్షణమే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు తొడుపునూరి రమేష్ కుమార్, నగర కౌన్సిల్ సభ్యులు వై. లెనిన్, కాంట్రాక్టు కార్మిక సంఘం నేత ఎం.ఏ. గౌస్, కంకటి రవి గౌడ్, లంక సురేష్, ఇందారపు సునీత, గాధం సరితలక్ష్మి, కొండు రమాదేవి, కంపెల సుశీల, జనగామ జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

VIJAY, RAMAGUNDAM

VIJAY, RAMAGUNDAM

Next Story