Ramagundam: కుందనపల్లి NTPC బూడిద రవాణాలో అక్రమ వసూళ్లు: చందర్!
Ramagundam: కుందనపల్లి ఎన్టీపీసీ బూడిద రవాణా లారీల నుంచి మూడేళ్లుగా లారీకి రూ.500 చొప్పున అక్రమ వసూళ్లు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తీవ్ర ఆరోపణలు చేశారు.
Ramagundam: కుందనపల్లి NTPC బూడిద రవాణాలో అక్రమ వసూళ్లు: చందర్!
రామగుండం: రామగుండం నియోజకవర్గం కుందనపల్లి ఎన్టీపీసీ బూడిద రవాణా లారీల నుంచి గత మూడేళ్లుగా ఒక్కో ట్రిప్పునకు రూ.500 చొప్పున వసూళ్లు జరిగాయన్న ఆరోపణలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ప్రభుత్వ ఉత్తర్వులు లేకుండా, జిల్లా కలెక్టర్ ఆదేశాలు లేకుండానే లారీల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ మూడేళ్లలో మొత్తం ఎంత సొమ్ము వసూలు చేశారు.
ఆ డబ్బు ఎవరికి చేరింది? అనే ప్రశ్నలను మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ లేవనెత్తారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం కుందనపల్లిలోని ఎన్టీపీసీ బూడిద చెరువు నుంచి అనుమతులు పొందిన కాంట్రాక్టర్లు లారీల ద్వారా బూడిదను రవాణా చేస్తున్నారు. అయితే ఈ రవాణా మార్గంలో కంటైనర్ ఏర్పాటు చేసి, స్థానిక రెవెన్యూ సిబ్బంది పేరుతో ఒక్కో లారీ ట్రిప్పునకు రూ.500 చొప్పున వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఈ వ్యవహారంపై ప్రశ్నలు తలెత్తిన నేపథ్యంలో ప్రస్తుతం వసూళ్ల కంటైనర్‌ను తాత్కాలికంగా తొలగించినట్లు చర్చ జరుగుతోంది. ఒక్కో లారీకి రూ.500 చొప్పున వసూలు చేస్తూ మూడేళ్లపాటు ఈ వ్యవహారం కొనసాగితే ఇప్పటివరకు ఎంత మొత్తం చేతులు మారి ఉంటుందనే అంశంపై చందర్ ప్రశ్నలు సంధించారు. రోజుకు ఎన్ని లారీలు రాకపోకలు సాగించాయి? మొత్తం ఎన్ని ట్రిప్పులు జరిగాయి? మూడు సంవత్సరాల్లో ఎంత డబ్బు వసూలైంది? ఈ సొమ్ము ఎవరి ఖాతాల్లోకి వెళ్లింది? అనే వివరాలను అధికార యంత్రాంగం బయటపెట్టాలని కోరారు.
జిల్లా కలెక్టర్ ఆదేశాలు లేకుండా, ప్రభుత్వ ఉత్తర్వులు జారీ కాకుండా లారీ రవాణాపై డబ్బులు వసూలు చేసే అధికారం ఎవరిచ్చారు? ప్రభుత్వ అనుమతి లేకుండా మూడేళ్లుగా ఈ వసూళ్లు జరిగితే సంబంధిత అధికారులు ఇంతకాలం ఏం చేస్తున్నట్లు? ఈ వ్యవహారానికి బాధ్యులైన వారిని గుర్తించి ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
కలెక్టర్, ఎమ్మెల్యే సమాధానం చెప్పాలి మాజీ శాసనసభ్యులు చందర్ డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్‌తో పాటు స్థానిక ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ఠాకూర్ స్పందించాలని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కోరారు. ప్రభుత్వ ఉత్తర్వులు లేకుండా వసూళ్లు జరిగాయా? జరిగితే అందుకు బాధ్యులెవరు? మూడేళ్లలో ఎంత మొత్తం వసూలు చేశారు? ఆ సొమ్ము ఎవరికి చేరింది? అక్రమ వసూళ్లకు పాల్పడిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
అవసరమైతే సీబీఐ, డీఓపీటీ తదితర కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేసి సమగ్ర విచారణ కోరుతానని చందర్ స్పష్టం చేశారు. కంటైనర్ తొలగింపుతో ఈ వ్యవహారాన్ని మరుగున పడనీయకుండా, మూడేళ్ల వసూళ్ల పూర్తి లెక్కలు ప్రజల ముందుంచి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.




