Ramagundam: ‘ఫిట్ కాప్’ యాప్ వినియోగంపై రామగుండం పోలీసులకు శిక్షణ
Ramagundam: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సిబ్బందికి ‘ఫిట్ కాప్’ యాప్లో ఆరోగ్య వివరాల నమోదుపై అడ్మిన్ డీసీపీ కె.శ్రీనివాస్ సమక్షంలో శిక్షణ ఇచ్చారు.
Ramagundam: ‘ఫిట్ కాప్’ యాప్ వినియోగంపై రామగుండం పోలీసులకు శిక్షణ
రామగుండం: తెలంగాణ పోలీస్ శాఖలో పనిచేస్తున్న సిబ్బంది ఆరోగ్య పరిరక్షణను లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం,హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ మరియు ఇతర సంస్థల సహకారంతో రూపొందించిన ‘ఫిట్ కాప్’ (Fit Cop) యాప్లో ఆరోగ్య వివరాల నమోదు, వినియోగ విధానంపై రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీసు సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
పోలీసులు విధి నిర్వహణలో ఎదుర్కొనే ఒత్తిడి, అధిక పని భారం కారణంగా తమ ఆరోగ్యంపై తగిన శ్రద్ధ చూపలేని పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, పోలీసు సిబ్బంది శారీరక,మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచాలనే ఉద్దేశంతో డీజీపీ సీవీ ఆనంద్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో కమిషనరేట్ కార్యాలయంలో ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కమిషనరేట్ పరిధిలోని ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి ఇద్దరు కానిస్టేబుళ్లను ఎంపిక చేసి వారికి యాప్ వినియోగంపై ప్రత్యేక శిక్షణ అందించారు.
ఈ సందర్భంగా పోలీసు సిబ్బంది తమ వ్యక్తిగత ఆరోగ్య వివరాలను ‘ఫిట్ కాప్’ యాప్లో నమోదు చేసే విధానాన్ని శిక్షణలో వివరించారు. ముఖ్యంగా డయాబెటిస్,అధిక రక్తపోటు (బీపీ), BMI,ఇప్పటికే ఉన్న ఇతర ఆరోగ్య సమస్యలు, జీవనశైలి అలవాట్లు, శారీరక వ్యాయామం, శారీరక చురుకుదనం, ధూమపానం, మద్యపానం వంటి వివరాలను యాప్లో నమోదు చేసే విధానంపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా అడ్మిన్ డీసీపీ మాట్లాడుతూ...,‘ఫిట్ కాప్’ యాప్ ద్వారా పోలీసు సిబ్బంది ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతో పాటు, ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి అవసరమైన వైద్య సలహాలు, చికిత్స అందించేందుకు అవకాశం కలుగుతుందని తెలిపారు.
పోలీసు సిబ్బంది ఆరోగ్య పరిరక్షణకు దోహదపడే ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని, శిక్షణ పొందిన సిబ్బంది తమ తమ పోలీస్ స్టేషన్లలోని ఇతర సిబ్బందికి కూడా ‘ఫిట్ కాప్’ యాప్ వినియోగంపై అవగాహన కల్పించాలని సూచించారు. పోలీసు సిబ్బంది ఆరోగ్య పరిరక్షణలో ‘ఫిట్ కాప్’ ఒక ముఖ్యమైన వ్యవస్థగా మారుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ గౌడ్, ఆర్ఐలు మల్లేశం, పెద్దన్న,ఎస్ఐ సంతోష్, ఆర్ఎస్ఐ ప్రవీణ్ కుమార్,ఐటీ కోర్ కోఆర్డినేటర్ రాము, సిబ్బంది రవి, రాజేందర్, హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ సభ్యులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.




