Karimnagar: వేలిముద్రలపై కారం చల్లిన దొంగ.. పట్టుకున్న పోలీసు!

Karimnagar: వేలిముద్రలు దొరకకుండా కారం పొడి చల్లి తప్పించుకు తిరుగుతున్న ఘరానా దొంగ బాలసాని అజయ్‌ను నాట్ గ్రిడ్ సాంకేతికతతో కరీంనగర్ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 28 Oct 2026 11:52 PM IST
Karimnagar
X

Karimnagar: వేలిముద్రలపై కారం చల్లిన దొంగ.. పట్టుకున్న పోలీసు!

కరీంనగర్‌: రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడి తప్పించుకుని తిరుగుతున్న ఓ ఘరానా దొంగను కరీంనగర్ రూరల్ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. వేలిముద్రల ఆనవాళ్లు దొరకకుండా కారం పొడి చల్లినా సాంకేతికతను అంది పుచ్చుకుని దోపిడీ దొంగను పట్టుకున్నారు. కరీంనగర్ రూరల్ సీఐ ఏ నిరంజన్ రెడ్డి కథనం ప్రకారం... పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం అల్లీపూర్ కు చెందిన బాలసాని అజయ్ ఇంటర్ చదువుతూ దొంగతనాలు చేయడం మొదలు పెట్టాడు.

గతంలో మానకొండూరు మండలం ఊటూరు బ్యాంకులో దోపిడీ చేసిన కేసుతో పాటు సుల్తానాబాద్ లో జరిగిన మూడు దొంగతనం కెసుల్లో అరెస్టు అయ్యాడు. 2025లో హైదరాబాద్ వెళ్లిన అజయ్ AMB షాపింగ్ మాల్ లో సేల్స్ మేన్ గా కొంతకాలం పని చేశాడు. అక్కడే సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న రాజుతో పరిచయం ఏర్పర్చుకున్నాడు. వీరిద్దరూ బైక్ పై శ్రీశైలం వెళ్లి తిరుగు ప్రయాణంలో నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి గ్రామంలో తాళం వేసి ఉన్న ఇంట్లోకి చొరబడ్డాడు. ఆ ఇంట్లో రెండున్నర తులాల బంగారం, కొంత నగదు ఎత్తుకెళ్లాడు. ఆ తర్వాత కాశీకి వెళ్లాలనుకున్న అజయ్ కరీంనగర్ చేరుకున్నాడు.

బొమ్మకల్ లో...

కరీంనగర్ రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలోని విజయ్ నగర్ కాలనీలోని ఓ ఇంట్లో చొరబడ్డ అజయ్ పావుతులం బంగారం, 25తులాల వెండి అపహరించాడు. అయితే తన వేలిముద్రలు పోలీసులకు లభ్యం కాకూడదని అనుకున్న అజయ్ అదే ఇంట్లో ఉన్న కారం పొడి చల్లి క్లూస్ టీమ్ కు చిక్కకుండా తప్పించుకునేందుకు ప్లాన్ వేశాడు. గత ఆగస్టు నెలలో జరిగిన ఈ దొంగతనం గురించి కరీంనగర్ రూరల్ పోలీసులు నిందితున్ని బుధవారం మధ్యాహ్నం బొమ్మకల్ కోకోకోలా దాభా వద్ద అరెస్ట్ చేశారు.

అయితే అజయ్ కి సంబంధించిన ఆనవాళ్లను నాట్ గ్రిడ్ యాప్ ద్వారా సేకరించిన పోలీసులు అతనే నిందితుడని టెక్నికల్ గా నిర్దారించుకున్నారు. అజయ్ ని అరెస్టు చేసి కరీంనగర్ కోర్టులో హాజరు పరిచామని సీఐ ఏ నిరంజన్ రెడ్డి తెలిపారు. క్లూస్ దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్న ఘరనా దొంగ అజయ్ ని అరెస్టు చేసిన కరీంనగర్ రూరల్ సీఐ, సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN