Thangallapalli: సారంపల్లిలో మట్టి టిప్పర్లను అడ్డుకున్న ప్రజలు!
Thangallapalli: తంగళ్లపల్లి మండలం సారంపల్లిలో మట్టి టిప్పర్లను అడ్డుకున్న గ్రామస్తులు, బీజేపీ నేతలు. అనుమతులకు విరుద్ధంగా మట్టి తరలిస్తున్నారంటూ మండిపాటు.
Thangallapalli: సారంపల్లిలో మట్టి టిప్పర్లను అడ్డుకున్న ప్రజలు!
Thangallapalli: తంగళ్లపల్లి మండలం సారంపల్లి గ్రామంలో మట్టి తరలిస్తున్న టిప్పర్లను గ్రామస్తులు అడ్డుకున్నారు. గ్రామంలోకి వస్తున్న భారీ టిప్పర్లను నిలిపివేసి గ్రామపంచాయతీ కార్యాలయానికి తరలించారు. మట్టి రవాణాతో గ్రామస్తులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆదివారం కావడంతో గ్రామంలో చిన్నారులు, మహిళలు, వృద్ధులు పెద్ద సంఖ్యలో రాకపోకలు సాగిస్తుంటారని స్థానికులు తెలిపారు. భారీ టిప్పర్ల రాకపోకలతో రోడ్డు దాటేందుకు కూడా భయపడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మట్టి తరలిస్తున్న కొన్ని టిప్పర్లకు నంబర్ ప్లేట్లు సక్రమంగా లేవని ఆరోపించారు.
ఎలాంటి నిబంధనలు పాటించకుండా భారీ టిప్పర్లు నడిపితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిదని గ్రామస్తులు ప్రశ్నించారు. గ్రామ రహదారులపై భారీ వాహనాల రాకపోకలను నియంత్రించాలని అధికారులను కోరారు.
మట్టి రవాణాపై బీజేపీ నేతల ఆగ్రహం
మట్టి తరలింపుపై బీజేపీ నాయకులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక సర్వే నంబర్‌లో మట్టి తరలింపునకు అనుమతులు తీసుకుని, గ్రామ శివారులోని పరంపోగు గుట్టను తవ్వి అక్రమంగా మట్టి రవాణా చేస్తున్నారని ఆరోపించారు.
స్థానిక అవసరాలకు మట్టి పర్మిషన్ ఇవ్వని అధికారులు ఇతర జిల్లాలకు మట్టి తరలించేందుకు అనుమతులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. భూముల సర్వే నంబర్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి, పంచనామా నిర్వహించకుండానే మట్టి తరలింపునకు అనుమతులు ఇచ్చారని బీజేపీ నాయకులు ఆరోపించారు.
మట్టి తవ్వకాలపై సమగ్ర విచారణ జరిపి, అనుమతుల పరిధిలోనే తవ్వకాలు జరుగుతున్నాయా లేదా అనే విషయాన్ని అధికారులు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
చర్యలు తీసుకోవాలని డిమాండ్
గ్రామంలో భారీ టిప్పర్ల రాకపోకల వల్ల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు. అనుమతులకు విరుద్ధంగా మట్టి తరలింపు జరుగుతున్నట్లు తేలితే సంబంధిత వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.




