Karimnagar: కరీంనగర్ లో 'పొగ' రాజకీయం.. అధికారుల అవినీతిపై మాజీ మేయర్ బాంబు!

Karimnagar: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో పెరుగుతున్న అవినీతిపై మాజీ మేయర్ సర్ధార్ రవీందర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 3 May 2026 7:37 AM IST
Karimnagar
X

Karimnagar: కరీంనగర్ లో 'పొగ' రాజకీయం.. అధికారుల అవినీతిపై మాజీ మేయర్ బాంబు!

Karimnagar: కరీంనగర్ నగరంలో ప్రజలను వేధిస్తున్న డంపింగ్ యార్డ్ సమస్య, టెండర్లలో జరుగుతున్న అవకతవకలు, కార్పొరేటర్లపై అన్యాయ అరెస్టులు, మున్సిపల్ పాలనలో పెరుగుతున్న అవినీతి అంశాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకే నేడు మీడియా సమావేశం నిర్వహించినట్లు మాజీ మేయర్, రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, 58వ డివిజన్ కార్పొరేటర్ సర్ధార్ రవీందర్ సింగ్ తెలిపారు. బీఆర్ఎస్ నగర కార్పొరేటర్లు, సర్పంచులు, ముఖ్య నేతలతో కలిసి ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రతిపక్ష నేతగా ప్రజలకు నిజాలు తెలియజేయడం తమ బాధ్యత అని స్పష్టం చేశారు.

కరీంనగర్ నగర ప్రజలు ప్రతిరోజూ డంపింగ్ యార్డ్ నుంచి ఎగసిపడుతున్న పొగ, మంటలు, దుర్వాసనతో నరకయాతన అనుభవిస్తున్నారని రవీందర్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం లేవగానే పొగతో నిండిన నగరాన్ని చూడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్, 15వ ఫైనాన్స్ కమిషన్ నిధుల ద్వారా డంపింగ్ యార్డ్ చెత్తను వేరు చేయడం, సిగ్రిగేషన్, తరలింపుకు రూ.2 కోట్లు మంజూరైనప్పటికీ ఇప్పటివరకు టెండర్లు కూడా ఓపెన్ చేయలేదని మండిపడ్డారు.

టెండర్లు ఓపెన్ కాకపోవడానికి ప్రధాన కారణం ప్రస్తుత టెండర్లలో ‘పే మిషన్’ లేకపోవడమేనని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. గతంలో చేసిన పనులు, చేయని పనులకు కూడా బిల్లులు ఎలా రాయాలో చూస్తూ మళ్లీ తమకు నచ్చిన వారికి కాంట్రాక్టులు ఇవ్వాలనే కుట్ర జరుగుతోందని అన్నారు. అర్హతలు లేని వారికి కూడా పనులు అప్పగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.

“నగర ప్రజలు పొగతో ఊపిరాడక ఇబ్బందులు పడుతుంటే, అధికారులు మాత్రం డబ్బుల లెక్కలు చూస్తున్నారు. ఇంకా ఎంత సంపాదిస్తారు?” అంటూ మండిపడ్డారు. రాత్రింబవళ్లు డంపింగ్ యార్డ్ పొగతో నగరమంతా కాలుష్యమై ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నా పట్టించుకునే వారు లేరన్నారు.

కొత్తగా వచ్చిన జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ నగర ప్రజల కష్టాలను గాలికి వదిలేశారని విమర్శించారు. డంపింగ్ యార్డ్ సమస్యపై ప్రజలు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేసినా, దరఖాస్తులు ఇచ్చినా స్పందన లేదన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారు, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా డంపింగ్ యార్డ్‌ను సందర్శించినా పరిష్కారం కనిపించలేదని పేర్కొన్నారు.

“ఎవరికి కట్టబెట్టాలో వారికి టెండర్ వచ్చేవరకు నగర ప్రజలను ఇలాగే పొగలో కాల్చేస్తారా?” అంటూ ప్రశ్నించారు. వెంటనే టెండర్లు ఓపెన్ చేసి పనులు ప్రారంభించాలని, లేదంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు.

ప్రజల కోసం నిలదీస్తే కార్పొరేటర్ల అరెస్టులా?

ఇటీవల నగరంలో ఒక కార్పొరేటర్ కుటుంబ సభ్యుడిని అరెస్టు చేసిన ఘటనను ప్రస్తావిస్తూ, ప్రజల సమస్యల కోసం నిలదీస్తే కేసులు పెడతారా అని ప్రశ్నించారు. తమ డివిజన్‌లో మరణించిన వ్యక్తి అంత్యక్రియల కోసం అధికారులు స్పందించకపోవడంతో ప్రశ్నిస్తే అరెస్టు చేయడం దారుణమన్నారు.

“కార్పొరేటర్లు ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలు పరిష్కరించాలనే ఎన్నికవుతారు… తగాదాలు పెట్టుకోవడానికి కాదు. ప్రజల కోసం మాట్లాడితే అరెస్టులు, కానీ కాంట్రాక్టర్లు అధికారులను దుర్భాషలాడినా కేసులు లేవు… ఇదేనా న్యాయం?” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అవినీతి అధికారులపై ఎందుకు చర్యలు లేవు?

మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ ఎస్‌ఈ అవినీతిపై తాను సాక్ష్యాధారాలతో FIR ఇచ్చి రెండేళ్లు గడిచినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు లేవని ఆరోపించారు. అరెస్టులు లేవు, నోటీసులు లేవు, విచారణ లేదు… కానీ ప్రశ్నించే వారిపై మాత్రం కేసులంటూ మండిపడ్డారు.

“ఒక అధికారి లక్షల కోట్ల అవినీతికి పాల్పడితే చూస్తూ ఊరుకుంటారా? మీరు చేస్తున్న అవినీతి చిట్టా మా దగ్గర ఉంది… అవసరమైతే మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం” అంటూ హెచ్చరించారు.

కార్పొరేటర్ అరెస్టులో చూపిన ఉత్సాహం అవినీతి అధికారులపై కూడా చూపించాలని పోలీసు శాఖను కోరారు. ప్రజల సమస్యలు చెప్పే ప్రజాప్రతినిధులపై వేగంగా చర్యలు తీసుకుంటే, ప్రజల డబ్బులు దోచుకునే వారిపై ఎందుకు మౌనం అని ప్రశ్నించారు.

రాష్ట్రవ్యాప్తంగా కార్పొరేటర్లకు పిలుపు

“ఉద్యమం ఏదైనా కరీంనగర్ నుంచే మొదలవుతుంది” అంటూ రాష్ట్రవ్యాప్తంగా కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు పిలుపునిచ్చారు. మీ నగరాల్లో అధికారులు అవినీతికి పాల్పడితే ఊరుకోకండి… పార్టీలకు అతీతంగా ప్రజల కోసం ఏకం కావాల్సిన సమయం వచ్చిందన్నారు.

మహాశక్తి ఆలయంలో ప్రమాణం చేస్తారా?

నగరంలోని సానిటరీ సూపర్వైజర్లు, సానిటరీ ఆఫీసర్లు, కమిషనర్లు ఎవరైనా రోడ్లపైకి వచ్చి ప్రజల బాగోగులు చూసారా అని ప్రశ్నించారు. అవినీతి చేయలేదని కరీంనగర్ మహాశక్తి ఆలయంలో ప్రమాణం చేయించేందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారు ముందుకు రావాలని సవాల్ విసిరారు.

ప్రజల కోసం పోరాటం ఆగదు

కరీంనగర్ నగర మున్సిపల్ కార్పొరేషన్‌లో రోజురోజుకీ ప్రజాస్వామ్యం, మానవత్వం కనుమరుగవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. డంపింగ్ యార్డ్ సమస్యను వెంటనే పరిష్కరించకపోతే స్థానిక ప్రజలతో కలిసి భారీ ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. అవినీతి అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR

Next Story