Karimnagar: అనుమతులు లేకుండా అడ్మిషన్లు చేస్తున్న కళాశాలలపై కేసులు పెట్టాలి!
Karimnagar: కరీంనగర్లో అనుమతుల్లేకుండా అడ్మిషన్లు చేస్తున్న శ్రీ వశిష్ట జూనియర్ కళాశాలపై క్రిమినల్ కేసులు పెట్టి సీజ్ చేయాలని SFI కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్ డిమాండ్ చేశారు.
Karimnagar: అనుమతులు లేకుండా అడ్మిషన్లు చేస్తున్న కళాశాలలపై కేసులు పెట్టాలి!
Karimnagar: భారత విద్యార్థి ఫెడరేషన్ (SFI) కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కరీంనగర్లోని కార్ఖానా గడ్డలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా SFI జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్ మాట్లాడుతూ కరీంనగర్ పట్టణంలో ఎలాంటి అనుమతులు లేకుండా ఒక భవనంలో గదిని అద్దెకు తీసుకొని, కళాశాల నిర్వహణకు అవసరమైన అనుమతులు పొందకుండానే అడ్మిషన్లు చేస్తున్న శ్రీ వశిష్ట జూనియర్ కళాశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని SFI కరీంనగర్ జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తున్నామని అన్నారు.
అనుమతులు లేకుండానే విద్యార్థులను, వారి తల్లిదండ్రులను మోసం చేస్తూ అడ్మిషన్లు నిర్వహించడం దుర్మార్గమైన చర్య అని విమర్శించారు. సరైన కళాశాల భవనం లేకపోయినా, ఇతర ప్రాంతాలకు చెందిన భవనాల ఫొటోలను చూపిస్తూ తల్లిదండ్రులను నమ్మించి అడ్మిషన్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోందని అన్నారు.
జిల్లా విద్యాశాఖ అధికారి సైతం పత్రికా ప్రకటన ద్వారా సదరు కళాశాలలకు అనుమతులు లేవని వెల్లడించారని గుర్తు చేశారు. అయితే ఈ ప్రకటన కేవలం పత్రికా ప్రకటనకే పరిమితం కాకుండా, విద్యాశాఖ అధికారులు ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి, నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్లు నిర్వహిస్తున్న యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, సంబంధిత కళాశాలలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు.
విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతూ, తల్లిదండ్రులను మోసం చేస్తున్న ఇలాంటి విద్యాసంస్థలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోకపోతే SFI ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళనలు నిర్వహించి, విద్యార్థుల పక్షాన పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి భోగేశ్వర్ నాయకులు వెంకటేష్ రోహిత్ రాజేష్, రిషి అంకిత్ తదితరులు పాల్గొన్నారు.




