Karimnagar: జీవో 97ను రద్దు చేయాలి.. ఎస్‌ఎఫ్‌ఐ కలెక్టరేట్ ముట్టడి!

Karimnagar: పాలిటెక్నిక్ విద్యా రక్షణ, జీవో 97 రద్దుకై కరీంనగర్‌లో ఎస్‌ఎఫ్‌ఐ కలెక్టరేట్ ముట్టడి. ఆందోళనకారుల అరెస్ట్. ప్రభుత్వ తీరుపై గజ్జెల శ్రీకాంత్ ధ్వజం.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 21 Aug 2026 1:53 PM IST
Karimnagar
X

Karimnagar: జీవో 97ను రద్దు చేయాలి.. ఎస్‌ఎఫ్‌ఐ కలెక్టరేట్ ముట్టడి!

Karimnagar: భారత విద్యార్థి ఫెడరేషన్ (SFI) కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని, ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యను పరిరక్షించాలని, జీవో నం. 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేసి CPTCకి తరలించారు.

ఈ సందర్భంగా SFI జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ (YISU) పేరుతో తీసుకువస్తున్న విధానాల ద్వారా పాలిటెక్నిక్ డిప్లమా కోర్సులను ITI-ATCలతో అనుసంధానం చేయడం విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే నిర్ణయమని అన్నారు.

పాలిటెక్నిక్ విద్య అనేది ప్రత్యేకమైన సాంకేతిక విద్యా వ్యవస్థ అని, దాని ప్రమాణాలను మరింత మెరుగుపరచాల్సిన ప్రభుత్వం అందుకు భిన్నంగా డిప్లమా కోర్సులను ఇతర శిక్షణా కోర్సులతో అనుసంధానం చేయడం సరికాదని అన్నారు. ఈ నిర్ణయం వల్ల పాలిటెక్నిక్ విద్యార్థుల విద్యా ప్రమాణాలు, ఉన్నత విద్యా అవకాశాలు, ఉపాధి అవకాశాలపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని జీవో నం. 97ను వెంటనే రద్దు చేయాలని, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను బలోపేతం చేయాలని, అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు.మంత్రి వివేక్ వెంకటస్వామి శక్తి స్కీం విద్యార్థులకు వరం అంటూ ప్రచారం చేయడం సరికాదని, అదే సమయంలో ప్రభుత్వ విద్యారంగానికి తగిన బడ్జెట్ కేటాయించకుండా విద్యా వ్యవస్థను ప్రైవేటీకరణ వైపు తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని అన్నారు. ఇప్పటికే విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ సకాలంలో అందక అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఇప్పుడు శక్తి స్కీం పేరుతో పాలిటెక్నిక్ విద్యను మరింత కార్పొరేట్ వైపు తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు.

పాలిటెక్నిక్ విద్యను ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ వైపు తీసుకెళ్లే చర్యలను వెంటనే నిలిపివేయాలని, శక్తి స్కీంను రద్దు చేయాలని, జీవో నం. 97ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో SFI జిల్లా అధ్యక్షులు కాంపెల్లి అరవింద్, రాష్ట్ర కమిటీ సభ్యులు సంజన, జిల్లా గర్ల్స్ కన్వీనర్ మానస, జిల్లా ఉపాధ్యక్షులు వినయ్ సాగర్, భోగేశ్వర్, జిల్లా కమిటీ సభ్యులు సన్నీ, సందేశ్, రాకేష్, అభిషేక్, సాయి తదితరులు పాల్గొన్నారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR

Next Story