Sircilla: సిరిసిల్ల పద్మశాలి బిడ్డకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించాలి!
Sircilla: సీనియర్ న్యాయవాది గుడ్ల జ్యోతి కిరణ్ శాసనమండలి (ఎమ్మెల్సీ) అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని కోరుతూ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌కు వినతిపత్రం అందజేత.
Sircilla: సిరిసిల్ల పద్మశాలి బిడ్డకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించాలి!
Sircilla: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అడ్వకేట్ జేఏసీ కో-కన్వీనర్‌గా చురుకైన పాత్ర పోషించిన సిరిసిల్లకు చెందిన సీనియర్ న్యాయవాది గుడ్ల జ్యోతి కిరణ్, శాసనమండలి సభ్యత్వానికి తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని కోరారు. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటలకు హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ను కలిసి లిఖితపూర్వకంగా వినతిపత్రం సమర్పించారు.
ఇటీవల సిరిసిల్ల పట్టణంలో పర్యటించిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, పద్మశాలి వర్గానికి చెందిన వ్యక్తికి ఎమ్మెల్సీ అవకాశం కల్పిస్తామని ప్రకటించిన నేపథ్యంలో, ఆ అవకాశాన్ని తనకు కల్పించాలని జ్యోతి కిరణ్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తాను చేపట్టిన ఉద్యమ కార్యక్రమాలు, సమాజ సేవలో చురుకుగా పాల్గొన్న సందర్భాలను వినతిపత్రంలో వివరించినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వ స్థాయిలో తన అభ్యర్థిత్వాన్ని పరిగణనలోకి తీసుకుని శాసనమండలి సభ్యత్వానికి తన పేరును ఖరారు చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సిరిసిల్ల, పరిసర ప్రాంతాలకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు, పద్మశాలి సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. మాజీ సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, ఎల్లారెడ్డిపేట మాజీ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండీ గౌస్, వైద్య శివప్రసాద్, ఎల్‌ఐ లక్ష్మీనారాయణ, జిల్లా పద్మశాలి సంఘం కన్వీనర్ కోడం శ్రీనివాస్, కొమిరిశెట్టి తిరుపతి, వంగరి దేవదాసు, మ్యాన ప్రసాద్, చేపూరి శ్రీనివాస్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అన్నదాత భాను, మాజీ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ స్వర్గం రాజు, సాయిబాబా టెంపుల్ డైరెక్టర్ అడ్డగట్ల శంకర్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రేగొండ సందీప్, కరీంనగర్‌కు చెందిన గుడ్ల రవి తదితరులు పాల్గొన్నారు.




