Sircilla: పేద విద్యార్థుల పదో తరగతి పరీక్ష ఫీజులు చెల్లించిన బండి సంజయ్!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో 3,920 మంది పదో తరగతి విద్యార్థులకు రూ.4.90 లక్షల పరీక్ష ఫీజులు చెల్లించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్.
Sircilla: పేద విద్యార్థుల పదో తరగతి పరీక్ష ఫీజులు చెల్లించిన బండి సంజయ్!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో 3,920 మంది విద్యార్థులకు రూ.4.90 లక్షల ఆర్థిక సాయం. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులపై చదువుల భారం పడకుండా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ తనవంతు సహకారం అందించారు. గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థుల ఎస్ఎస్సీ పరీక్ష ఫీజులను తన సొంత నిధులతో చెల్లించారు.
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, జగిత్యాల, హనుమకొండ జిల్లాలకు చెందిన మొత్తం 10,959 మంది విద్యార్థుల పరీక్ష ఫీజుల కోసం రూ.13,65,390 ఆర్థిక సహాయం అందించారు. ఇందులో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న 3,920 మంది విద్యార్థుల పరీక్ష ఫీజుల నిమిత్తం రూ.4,90,000 కేటాయించారు.
ఈ మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా అదనపు కలెక్టర్కు బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి పరీక్ష ఫీజుల నిధులకు సంబంధించిన చెక్కును అందజేశారు.
ఈ సందర్భంగా రెడ్డబోయిన గోపి మాట్లాడుతూ.. ఆర్థిక ఇబ్బందుల కారణంగా పేద, మధ్యతరగతి విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు దూరం కాకూడదనే ఉద్దేశంతో బండి సంజయ్ కుమార్ వరుసగా రెండో ఏడాది పరీక్ష ఫీజులను భరిస్తున్నారని తెలిపారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి, ఉజ్వల భవిష్యత్తుకు అండగా నిలుస్తున్న బండి సంజయ్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు ఎర్రం మహేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి సిరికొండ శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు మార్త సత్తయ్య, సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్, చందుర్తి మండల అధ్యక్షుడు, బీజేపీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.




