Sircilla: ఖర్గే వ్యాఖ్యలకు నిరసనగా సిరిసిల్లలో బీజేపీ ఆందోళన!
Sircilla: ప్రధాని మోదీపై ఖర్గే వ్యాఖ్యలను నిరసిస్తూ సిరిసిల్లలో బీజేపీ ఆందోళన చేపట్టింది. జిల్లా అధ్యక్షుడు గోపి ఆధ్వర్యంలో ఖర్గే దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు.
Sircilla: ఖర్గే వ్యాఖ్యలకు నిరసనగా సిరిసిల్లలో బీజేపీ ఆందోళన!
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసనలో ఖర్గే దిష్టిబొమ్మను దహనం చేసి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
సిరిసిల్ల-కామారెడ్డి ప్రధాన రహదారిపై బీజేపీ శ్రేణులు బైఠాయించి నిరసన తెలిపారు. ఖర్గే వెంటనే ప్రధాని నరేంద్ర మోదీకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దిష్టిబొమ్మ దహనానికి బీజేపీ నాయకులు, కార్యకర్తలు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులకు, బీజేపీ శ్రేణులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. అయినప్పటికీ వెనక్కి తగ్గని బీజేపీ కార్యకర్తలు చివరకు ఖర్గే దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ ఆందోళనతో ప్రధాన రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది.
ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ప్రజల మద్దతు కోల్పోతున్న కాంగ్రెస్ పార్టీ అసహనంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగత విమర్శలకు దిగుతోందని ఆరోపించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలు, ప్రధాని కుటుంబ సభ్యులను ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్యలు సమంజసం కాదని అన్నారు.
ఎన్నికల వ్యవస్థపై కాంగ్రెస్ పార్టీ గతంలో ఒక విధంగా మాట్లాడి, ప్రస్తుతం అదే వ్యవస్థపై విమర్శలు చేయడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాల్సిన బాధ్యత ప్రతి రాజకీయ పార్టీపై ఉందని పేర్కొన్నారు.
రాజకీయాల్లో విధానపరమైన విమర్శలు ఉండాలి తప్ప వ్యక్తిగత దూషణలకు తావుండకూడదని బీజేపీ నాయకులు స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం రాజకీయ సంస్కృతికి విరుద్ధమని పేర్కొంటూ.. మల్లికార్జున ఖర్గే తన వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.




