Sircilla: పాము కాటు చికిత్సపై నిర్లక్ష్య సమాధానం.. సిరిసిల్ల సూపరింటెండెంట్‌పై ఫైర్
Sircilla: పాము కాటు బాధితురాలి వైద్యంపై నిర్లక్ష్యంగా మాట్లాడిన సిరిసిల్ల సివిల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రవీణ్ కుమార్‌ను తొలగించాలని దండు వినోద్ డిమాండ్ చేశారు.
Sircilla: పాము కాటు చికిత్సపై నిర్లక్ష్య సమాధానం.. సిరిసిల్ల సూపరింటెండెంట్‌పై ఫైర్
రాజన్న సిరిసిల్ల జిల్లా: పాము కాటుకు గురైన మహిళకు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయా అని అడిగితే సిరిసిల్ల సివిల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రవీణ్ కుమార్ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు దండు వినోద్ ఆరోపించారు. పేద, మధ్యతరగతి ప్రజల ఆరోగ్యంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ప్రజలకు సరైన వైద్య సేవలు అందించని సూపరింటెండెంట్‌ను తక్షణమే విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు.
నిన్న సాయంత్రం ఓ మహిళ పాము కాటుకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆమెకు ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారని దండు వినోద్ తెలిపారు. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉండటంతో, తదుపరి చికిత్స ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉందో లేదో తెలుసుకునేందుకు సిరిసిల్ల సివిల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రవీణ్ కుమార్‌కు ఫోన్ చేసినట్లు పేర్కొన్నారు.
ఆదివారం కావడంతో పాము కాటుకు సంబంధించిన వైద్యులు అందుబాటులో ఉన్నారా? అవసరమైన చికిత్స అందించగలరా? అని అడిగిన సందర్భంలో.. “మీరు నాకెందుకు ఫోన్ చేస్తున్నారు?” అంటూ సూపరింటెండెంట్ సమాధానమిచ్చారని దండు వినోద్ ఆరోపించారు.
ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడికే ఈ తరహా సమాధానం ఎదురైతే, ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేద, మధ్యతరగతి సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్నారు. సిరిసిల్ల సివిల్ ఆసుపత్రిలో పేద ప్రజలకు సరైన వైద్య సేవలు అందడం లేదని విమర్శించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రవీణ్ కుమార్‌ను మార్చాల్సిన అవసరం ఉందని, ఈ విషయంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ డిమాండ్ చేస్తోందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు అరకల రమేష్, కార్మిక విభాగం అధ్యక్షుడు కోడూరు శ్రీహరి, పట్టణ ప్రధాన కార్యదర్శి చెట్టుపల్లి నరేందర్, మండల అధ్యక్షులు లక్కపాక రాకేష్, గుండేటి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.




