Sircilla: విద్యతోనే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చు.. కలెక్టర్ గరిమ అగ్రవాల్!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో హెచ్డీఎఫ్సీ సీఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన స్మార్ట్ క్లాస్‌రూమ్‌లను కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రారంభించారు.
Sircilla: విద్యతోనే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చు.. కలెక్టర్ గరిమ అగ్రవాల్!
Sircilla: విద్యార్థుల ప్రగతికి చదువే ప్రధాన ఆధారమని, విద్యార్థి దశ నుంచే ప్రణాళికాబద్ధంగా అభ్యసిస్తూ లక్ష్యాలను సాధించే దిశగా ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. ఆదర్శ వ్యక్తుల జీవితాలను స్ఫూర్తిగా తీసుకొని ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.
మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి, జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) నిధులతో జిల్లాలోని 20 ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన స్మార్ట్ క్లాస్‌రూమ్‌లలో భాగంగా.. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూర్ ఎంపీహెచ్ఎస్లో ఏర్పాటు చేసిన స్మార్ట్ క్లాస్‌రూమ్‌ను బుధవారం కలెక్టర్ ప్రారంభించారు.
జిల్లాలోని 20 పాఠశాలల్లో ఒక్కో తరగతి గదికి రంగులు వేయడంతో పాటు నాలుగు ఫ్యాన్లు, లైట్లు, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్, 10 డెస్క్‌లు, యూపీఎస్‌లను ఏర్పాటు చేశారు. ఇందుకోసం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సీఎస్ఆర్ నిధుల కింద కోటి రూపాయలు వెచ్చించింది.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వ్యక్తి వికాసం, అభివృద్ధికి విద్య ఒక శక్తివంతమైన ఆయుధమని పేర్కొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్, మౌలానా అబుల్ కలాం ఆజాద్, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వంటి మహనీయులు విద్యాభ్యాస సమయంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఉన్నత స్థాయికి చేరుకున్నారని గుర్తు చేశారు. దేశ నిర్మాణంలో వారు అందించిన సేవలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమన్నారు. అలాగే సుధామూర్తి విద్యాభ్యాసం, జీవిత ప్రయాణం కూడా విద్యార్థులకు ఆదర్శమని పేర్కొన్నారు.
విద్యార్థులు తమ ప్రాంతం, మాట్లాడే భాష, ఆర్థిక పరిస్థితి, కుటుంబ నేపథ్యం వంటి అంశాలను ఉన్నత విద్యకు అడ్డంకులుగా భావించకూడదని స్పష్టం చేశారు. ప్రతి విద్యార్థి అన్ని పాఠ్యాంశాలపై పట్టు సాధిస్తూ క్రమశిక్షణతో చదవాలని సూచించారు. భవిష్యత్తులో ఉన్నత ఉద్యోగాలు సాధించడం, స్వయం ఉపాధి పొందడం లేదా వివిధ రంగాల్లో రాణించడం వంటి లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకు సాగాలని ఆకాంక్షించారు. విద్యార్థుల ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమని కలెక్టర్ పేర్కొన్నారు.
ప్రభుత్వ విద్యాసంస్థల్లో సీఎస్ఆర్ నిధులతో వసతులు
కలెక్టర్ ప్రత్యేక చొరవతో జిల్లాలోని ప్రభుత్వ విద్యాసంస్థలు, ఆసుపత్రుల్లో సీఎస్ఆర్ నిధులతో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సిరిసిల్ల, వేములవాడ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో రూ.22 లక్షలతో విద్యార్థినుల కోసం 145 పడకలు, పరుపులు ఏర్పాటు చేశారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఆధ్వర్యంలో రూ.కోటితో 20 పాఠశాలల్లో స్మార్ట్ క్లాస్‌రూమ్‌లు అందుబాటులోకి తీసుకొచ్చారు. త్వరలో జిల్లాలోని పలు ఆసుపత్రులు, అంగన్వాడీ కేంద్రాల్లోనూ సీఎస్ఆర్ నిధులతో సదుపాయాల కల్పన పనులు ప్రారంభించనున్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి విజయ్ సాగర్, తహసీల్దార్ మహేశ్, లీడ్ బ్యాంక్ మేనేజర్ రాజీవ్ కుమార్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ బాధ్యులు శ్రావణ్ కుమార్, నాగేశ్వరరావు, కమలాకర్, మండల విద్యాధికారి దూస రఘుపతి, కాంప్లెక్స్ హెచ్ఎం మోతిలాల్, ఏఏపీసీ చైర్పర్సన్ తిప్పవరం సుధ, హెచ్ఎం చక్రవర్తుల రమాదేవి, వార్డు కౌన్సిలర్లు లింగంపల్లి భాగ్యలక్ష్మి, దొంతినేని కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.




