Sircilla: సిరిసిల్ల నవజాత శిశువుల ఆరోగ్యంపై కలెక్టర్ సమీక్ష

Sircilla: సిరిసిల్లలో శిశు మరణాలను అరికట్టాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశం. గర్భిణులకు అవగాహన, నార్మల్ డెలివరీలపై ప్రోత్సాహం. లింగ నిర్ధారణ పరీక్షలపై హెచ్చరిక.

KALEEM, SIRICILLA
Published on: 15 July 2026 9:44 PM IST
Sircilla
X

Sircilla: సిరిసిల్ల నవజాత శిశువుల ఆరోగ్యంపై కలెక్టర్ సమీక్ష

సిరిసిల్ల: జిల్లాలో నవజాత శిశువుల మరణాలు సున్నా శాతానికి చేరేలా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. సంకల్ప్ కార్యక్రమంలో భాగంగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల గైనకాలజిస్టులు, చిన్నపిల్లల వైద్య నిపుణులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.

గత మూడు నెలల నవజాత శిశువుల మరణాలు, వాటి కారణాలపై సుదీర్ఘంగా సమీక్షించిన కలెక్టర్, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, వేములవాడ ఏరియా ఆస్పత్రిలోని ఎస్‌ఎన్‌సీయూ సేవలపై ఆరా తీశారు.

గర్భిణులకు బీపీ, షుగర్, రక్త పరీక్షలతో పాటు అవసరమైన అన్ని వైద్య పరీక్షలు క్రమం తప్పకుండా నిర్వహించాలని సూచించారు. అలాగే గర్భిణులకు యోగా, వ్యాయామంపై అవగాహన కల్పిస్తూ నార్మల్ డెలివరీల వల్ల కలిగే ప్రయోజనాలను వివరించాలని చెప్పారు. హైరిస్క్ గర్భిణులకు మాత్రమే సీ-సెక్షన్ చేయాలని స్పష్టం చేశారు.

బాలింతలకు పుట్టిన వెంటనే తల్లిపాలు ఇవ్వడం, నవజాత శిశువుల సంరక్షణపై అవగాహన కల్పించాలని, పుట్టిన గంటలోపే శిశువును తల్లి వద్దకు చేర్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నెలలు నిండక లేదా తక్కువ బరువుతో పుట్టిన శిశువులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.

లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం చట్టవిరుద్ధమని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ హెచ్చరించారు. సమావేశంలో జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్, డీసీహెచ్‌ఎస్ రవీందర్, జిల్లా పంచాయతీ అధికారి జయశీల, వైద్యులు, ఐఎంఏ సభ్యులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story