Sircilla: ఎయిడ్స్ నియంత్రణపై విస్తృత అవగాహన కల్పించాలి - కలెక్టర్
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎయిడ్స్ నియంత్రణపై అధికారులతో సమీక్షించిన కలెక్టర్ గరిమ అగ్రవాల్. పరీక్షలు, అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశం.
Sircilla: ఎయిడ్స్ నియంత్రణపై విస్తృత అవగాహన కల్పించాలి - కలెక్టర్
సిరిసిల్ల: ఎయిడ్స్ నియంత్రణపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.
ఐడీఓసీలో ఎయిడ్స్ నియంత్రణపై వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా సంక్షేమ శాఖ, విద్య, యువజన శాఖ, జడ్పీ సీఈవో తదితర అధికారులతో గురువారం సమన్వయ సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఎయిడ్స్ పాజిటివ్ కేసుల సంఖ్య, వారికి అందుతున్న వైద్యం, మందులు, కౌన్సెలింగ్ తదితర సేవలపై కలెక్టర్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
జిల్లాలో ప్రస్తుతం 1,283 ఎయిడ్స్ పాజిటివ్ కేసులు ఉన్నాయని, బాధితులకు నెలనెలా మందులు అందిస్తున్నామని అధికారులు కలెక్టర్‌కు వివరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎయిడ్స్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని సూచించారు. పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల్లో పకడ్బందీగా పరీక్షలు చేపట్టాలని, బాధితులకు నిరంతరం వైద్యం, మందులు, కౌన్సెలింగ్ అందించాలని ఆదేశించారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, వేములవాడ ఏరియా ఆస్పత్రి, అర్బన్ హెల్త్ సెంటర్ల పరిధిలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రత్యేక షెడ్యూల్ రూపొందించి దాని ప్రకారం పరీక్షలు నిర్వహించాలని సూచించారు. యువత, విద్యార్థులకు అవగాహన సమావేశాలతో పాటు వివిధ పోటీలు నిర్వహించాలని ఆదేశించారు.
సమావేశంలో జడ్పీ సీఈవో వెంకట మాధవరావు, జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్, జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రవీణ్ కుమార్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం, యువజన క్రీడల శాఖ అధికారి రాందాస్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.




