Sircilla: చెరువులు, వెట్‌ల్యాండ్స్ రక్షణకు కలెక్టర్ ఆదేశం
Sircilla: సిరిసిల్ల జిల్లాలోని 164 చెరువులు, వెట్‌ల్యాండ్స్ రక్షణకు కలెక్టర్ గరిమ అగ్రవాల్ సమగ్ర కార్యాచరణ ఆదేశించారు.
Sircilla: చెరువులు, వెట్‌ల్యాండ్స్ రక్షణకు కలెక్టర్ ఆదేశం
సిరిసిల్ల: జిల్లాలో గుర్తించిన చెరువులు, వెట్‌ల్యాండ్స్, రిజర్వాయర్ల సంరక్షణ, అభివృద్ధికి సమగ్ర కార్యాచరణ రూపొందించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో అటవీ, రెవెన్యూ, నీటిపారుదల, మత్స్య, వ్యవసాయ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖల అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు.
జిల్లాలో మొత్తం 164 చెరువులను గుర్తించినట్లు కలెక్టర్ తెలిపారు. ఆయా చెరువుల హద్దులు, పూర్తి విస్తీర్ణం, ఎఫ్‌టీఎల్ వివరాలను సంబంధిత శాఖల సమన్వయంతో సర్వే చేసి మ్యాపింగ్, ఆన్‌లైన్ నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.
చెరువులు, వెట్‌ల్యాండ్స్ భూగర్భ జలాల పెరుగుదలకు, పర్యావరణ పరిరక్షణకు కీలకమని కలెక్టర్ పేర్కొన్నారు. జల వనరుల అభివృద్ధి, మరమ్మతు పనులను అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టేలా ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించారు. ఇవి పక్షులు, జంతువులకు ఆవాసాలుగా ఉపయోగపడటంతో పాటు పర్యాటక రంగ అభివృద్ధికి కూడా దోహదపడతాయని తెలిపారు. చెరువులను కబ్జాల నుంచి రక్షించడంతో పాటు మొక్కలు, చేపల పెంపకానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.
భూముల రీ సర్వేలో శాఖల భాగస్వామ్యం
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూముల రీ సర్వేలో అన్ని శాఖల అధికారులు భాగస్వాములు కావాలని కలెక్టర్ ఆదేశించారు. ఆయా శాఖలకు చెందిన భూముల వివరాలను సర్వే అధికారులకు అందించి, సర్వే ప్రక్రియలో పాల్గొనాలని సూచించారు. దీంతో ప్రభుత్వ భూముల వివరాలు పక్కాగా నమోదు అవుతాయని తెలిపారు.
ప్రస్తుతం రీ సర్వే జరుగుతున్న గ్రామాల్లో రైతులు పాల్గొనేలా వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో ఆర్డీఓలు శ్రీధర్ బాబు, కేఎస్‌బీ కుమారి, డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, జిల్లా మత్స్య శాఖ అధికారి సౌజన్య, నీటిపారుదల శాఖ అధికారి ప్రశాంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.




