Sircilla: ప్రభుత్వ బడుల నిర్వహణపై దృష్టి పెట్టాలి: కలెక్టర్!

Sircilla: ప్రభుత్వ, గురుకుల పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు.

KALEEM, SIRICILLA
Published on: 2 Nov 2026 9:32 PM IST
Sircilla
X

Sircilla: ప్రభుత్వ బడుల నిర్వహణపై దృష్టి పెట్టాలి: కలెక్టర్!

రాజన్న సిరిసిల్ల జిల్లా: ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ విద్యాలయాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు అదనపు తరగతి గదులు, టాయిలెట్లు, ఇతర అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ)లో సోమవారం అదనపు కలెక్టర్ గడ్డం నగేష్‌తో కలిసి జిల్లా కలెక్టర్ వివిధ ప్రభుత్వ, రెసిడెన్షియల్ విద్యాలయాల అధికారులు, ఇంజనీరింగ్ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కేజీబీవీ డీసీఓలు, ఈఎంఆర్ఎస్ బాధ్యులు, ఈఈ పీఆర్, టీజీఈడబ్ల్యూఐడీసీ అధికారులతో విద్యాసంస్థల్లోని పరిస్థితులపై సమీక్షించారు.

ఈ సందర్భంగా అన్ని విద్యాలయాల్లో మెనూ ప్రకారం భోజనం అందించడం, విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు, అవసరమైన మౌలిక సదుపాయాలు, తరగతి గదులు, వసతి గదుల నిర్మాణ పనుల పురోగతిపై చర్చించారు. టాస్క్‌ఫోర్స్ బృందాల తనిఖీ నివేదికలను పరిశీలించి, తీసుకున్న చర్యలు, చేపట్టాల్సిన తదుపరి చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

టీజీఈడబ్ల్యూఐడీసీ ఆధ్వర్యంలో జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో మొత్తం 19 అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయని అధికారులు కలెక్టర్‌కు వివరించారు.

జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. ఈఈ పీఆర్, టీజీఈడబ్ల్యూఐడీసీ ఆధ్వర్యంలో చేపట్టిన అదనపు తరగతి గదులు, టాయిలెట్లు, ప్రహరీ గోడలు, ఇతర మౌలిక వసతుల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని సూచించారు. పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.

అన్ని ప్రభుత్వ, రెసిడెన్షియల్ విద్యాలయాల్లో మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని, విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు నిరంతరం అందుబాటులో ఉండేలా చూడాలని స్పష్టం చేశారు. అన్ని మండలాల ప్రత్యేక అధికారులు తమ పరిధిలోని ప్రతి రెసిడెన్షియల్ విద్యాలయాన్ని తప్పనిసరిగా తనిఖీ చేయాలని ఆదేశించారు. విద్యాసంస్థల్లో ఫ్యాన్లు, లైట్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, జిల్లా విద్యాధికారి విజయ సాగర్, డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, ఈఈ పీఆర్ సుదర్శన్ రెడ్డి, టీజీఈడబ్ల్యూఐడీసీ ఈఈ రామకృష్ణ, అన్ని మండలాల ప్రత్యేక అధికారులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కేజీబీవీ డీసీఓలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA