Sircilla: రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం కలెక్టర్ గరిమ సమీక్ష
Sircilla: రాజన్న సిరిసిల్ల రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో కలెక్టర్ గరిమ అగ్రవాల్ సమీక్ష; రహవీర్ పథకం కింద ఆటో డ్రైవర్ పోసు శ్రీనివాస్‌కు రూ.25 వేల సాయం.
Sircilla: రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం కలెక్టర్ గరిమ సమీక్ష
రాజన్న సిరిసిల్ల జిల్లా: రోడ్డు ప్రమాదాలను తగ్గించి, వాహనదారుల ప్రాణాలను కాపాడడమే లక్ష్యంగా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్, జిల్లా రోడ్డు భద్రతా కమిటీ చైర్పర్సన్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో వివిధ శాఖల అధికారులతో జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీఎం రహత్, పీఎం రహవీర్, హిట్ అండ్ రన్ పథకాలకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు.
రహవీర్ కింద రూ.25 వేల ఆర్థిక సహాయం
రోడ్డు ప్రమాద బాధితులను సకాలంలో ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడిన సిరిసిల్లకు చెందిన ఆటో డ్రైవర్ పోసు శ్రీనివాస్‌ను కలెక్టర్ అభినందించారు. ప్రమాదం జరిగిన వెంటనే బాధితులను గోల్డెన్ అవర్‌లోపు సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడినందుకు రహవీర్ (రహదారి వీరుడు) పథకం కింద రూ.25 వేల ఆర్థిక సహాయం చెక్కును అందజేశారు. అలాగే పీఎం రహత్ పథకం కింద ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో 16 మంది చికిత్స పొందినట్లు అధికారులు వెల్లడించారు.
రోడ్డు భద్రతకు పలు చర్యలు
గత సమీక్ష సమావేశం అనంతరం జిల్లాలో చేపట్టిన రోడ్డు భద్రతా పనుల వివరాలను అధికారులు సమావేశంలో వివరించారు. సిరిసిల్ల–సిద్దిపేట మార్గంలో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నేరెళ్ల బస్వాపూర్ జంక్షన్, నేరెళ్ల గ్రామపంచాయతీ వద్ద రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేశారు. తంగళ్లపల్లి నుంచి జిల్లెల వరకు రోడ్డు వెంట ఉన్న చెట్ల కొమ్మలను తొలగించారు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని శాత్రాజుపల్లి వద్ద మున్సిపాలిటీ ఆధ్వర్యంలో రూ.లక్ష వ్యయంతో హైమాస్ట్ లైట్ ఏర్పాటు చేశారు. మర్రిపల్లి వద్ద రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో రహదారిపై గుంతలను వెట్ మిక్స్‌తో పూడ్చారు. కలెక్టరేట్ నుంచి రగుడు జంక్షన్ వరకు సిరిసిల్ల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో బీటీ రోడ్డు టాప్ లేయర్ పనులు పూర్తి చేశారు.
నెల రోజుల్లో 45 రోడ్డు ప్రమాదాలు.. 11 మంది మృతి
జిల్లాలో గత నెలలో జరిగిన రోడ్డు ప్రమాదాలు, మరణాలపై సమావేశంలో సమీక్షించారు. నెల రోజుల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కింద 866 కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇదే సమయంలో జిల్లాలో 45 రోడ్డు ప్రమాదాలు జరగగా 11 మంది మృతి చెందారని, 45 మంది గాయపడ్డారని వెల్లడించారు. ఓవర్‌లోడ్‌తో ప్రయాణిస్తున్న 37 వాహనాలపై జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో కేసులు నమోదు చేసినట్లు అధికారులు వివరించారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు
ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల నివారణకు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడం అత్యంత ముఖ్యమని అన్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. పాఠశాల బస్సులు, ఆటోల్లో విద్యార్థులను నిబంధనలకు అనుగుణంగా తరలించేలా పర్యవేక్షించాలన్నారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్లకు ప్రత్యేక అవగాహన తరగతులు నిర్వహించి రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించాలని ఆదేశించారు.
అవసరమైన ప్రాంతాల్లో సైన్ బోర్డులు, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎక్కువ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను ఆర్అండ్బీ, రవాణా, పోలీసు శాఖల అధికారులు సంయుక్తంగా పరిశీలించి అవసరమైన మరమ్మతు పనులు చేపట్టాలన్నారు. ప్రతి వాహనదారుడు రోడ్డు భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. రహదారులపైకి విస్తరించే చెట్ల కొమ్మలను ఎప్పటికప్పుడు తొలగించాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో ఈఈ ఆర్అండ్బీ భీమ్లా నాయక్, జిల్లా రవాణా అధికారి శ్రీనివాస్, రోడ్డు భద్రతా కమిటీ సభ్యుడు శ్రీనాథ్, ఎస్బీ డీఎస్బీ వెంకటేశ్వర్లు, ఈఈ పీఆర్ సుదర్శన్ రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి విజయసాగర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్, మున్సిపల్ కమిషనర్లు ఖదీర్ పాషా, లోకేష్, జాతీయ రహదారుల అధికారులు, ట్రాఫిక్ పోలీసులు తదితరులు పాల్గొన్నారు.




