Sircilla: నిరుపేద మహిళకు ఇందిరమ్మ ఇంటి మంజూరు పత్రం అందజేసిన కలెక్టర్!
Sircilla: అద్దె ఇంట్లో ఇబ్బందులు పడుతున్న నిరుపేద మహిళ మర్రిపల్లి అమృతకు రాజన్న సిరిసిల్ల కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఇందిరమ్మ ఇంటి మంజూరు పత్రం అందజేశారు.
Sircilla: నిరుపేద మహిళకు ఇందిరమ్మ ఇంటి మంజూరు పత్రం అందజేసిన కలెక్టర్!
రాజన్న సిరిసిల్ల జిల్లా: సొంత ఇల్లు లేక అద్దె ఇంట్లో ఉంటూ ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేద మహిళకు జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అండగా నిలిచారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద చందుర్తి మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన మర్రిపల్లి అమృతకు ఇంటి మంజూరు పత్రాన్ని అందజేశారు.
అమృత బతుకుదెరువు నిమిత్తం సుమారు 20 ఏళ్ల క్రితం నిజామాబాద్ జిల్లాకు వెళ్లారు. నాలుగేళ్ల క్రితం తన కుమారుడి అనారోగ్య సమస్యల నేపథ్యంలో వేములవాడకు తిరిగి వచ్చారు. సొంత ఇల్లు లేకపోవడంతో అద్దె ఇంట్లో ఉంటూ అద్దె చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ వెంటనే అధికారుల ద్వారా ఆమె వివరాలను సేకరించి పరిస్థితిని తెలుసుకున్నారు.
ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో అమృతకు ప్రత్యేకంగా ఇందిరమ్మ ఇంటి మంజూరు పత్రాన్ని అందజేశారు. వేములవాడ పట్టణంలోని 12వ వార్డులో తనకు 60 గజాల స్థలం ఉందని, అందులో ఇంటిని నిర్మించుకుంటానని అమృత తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి, తనకు అండగా నిలిచిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్కు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఇన్చార్జి హౌసింగ్ పీడీ సాజిద్, వేములవాడ మున్సిపల్ కమిషనర్ లోకేష్ తదితరులు పాల్గొన్నారు.




