Sircilla: సిరిసిల్ల కొత్తచెరువు నాలాల కబ్జాపై అధికారులకు ఫిర్యాదు
Sircilla: సిరిసిల్ల కొత్తచెరువు సహజ నాలాలు, మత్తడి కాలువల కబ్జాలపై ఏఐఎఫ్‌టీయూ (న్యూ) నేత సోమిశెట్టి దశరథం కలెక్టర్, ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు.
Sircilla: సిరిసిల్ల కొత్తచెరువు నాలాల కబ్జాపై అధికారులకు ఫిర్యాదు
సిరిసిల్ల: సిరిసిల్లలో కొత్తచెరువు సహజ నాళాలు, మత్తడి నీరు వెళ్లే సహజ కాలువల కబ్జాపై ఫిర్యాదు చేశారు. నీటిపారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో పాటు జిల్లా కలెక్టర్, సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్, ఇరిగేషన్ అధికారులకు ఏఐఎఫ్‌టీయూ న్యూ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కామ్రేడ్ సోమిశెట్టి దశరథం రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
కొత్తచెరువు నాలాల కబ్జాలపై గత కొన్ని సంవత్సరాలుగా స్థానిక అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినట్లు దశరథం తెలిపారు. 2021లో వరదల సమయంలో అప్పటి స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్‌కు కూడా వినతిపత్రం అందించినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని పేర్కొన్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా కాలువల కబ్జాలు మరింత పెరిగాయని ఆరోపించారు.
వర్షాకాలంలో చెరువు నీటి సమస్యను మాత్రమే పట్టించుకోకుండా, ముందస్తుగా సహజ నాళాలు, మత్తడి నీరు వెళ్లే కాలువలను పరిరక్షించాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్‌లో కబ్జాల కారణంగా ప్రజలకు ఇబ్బందులు, అనర్థాలు తలెత్తే అవకాశం ఉందని తెలిపారు.
కొత్తచెరువు సహజ నాళాలు, మత్తడి కాలువల కబ్జాలను గుర్తించి తొలగించి, నీటి ప్రవాహానికి ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. సమస్యపై అధికారులు, స్థానిక ఎమ్మెల్యే తక్షణం దృష్టి సారించి పరిష్కారం చూపకపోతే ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని దశరథం హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఎర్రజెండా పవర్‌లూమ్ కార్మిక సంఘం నాయకుడు గుజ్జే దేవదాస్, తెలంగాణ రైతు కూలీ సంఘం నాయకుడు సలేంద్రి ఎల్లయ్య పాల్గొన్నారు.




