Sircilla: బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అప్పులపాలు
Sircilla: పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టారని, ఈ నెల 19న సిద్దిపేట సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు.
Sircilla: బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అప్పులపాలు
రాజన్న సిరిసిల్ల జిల్లా: పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని కాంగ్రెస్ నాయకులు మల్లారెడ్డి, రాంరెడ్డి విమర్శించారు. ఈ నెల 19న సిద్దిపేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.
సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో అప్పులు లేని పరిస్థితి ఉండగా, పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సుమారు రూ.8.5 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టారని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వేల ఎకరాల భూములు, అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు సంపాదించుకుని వందల కోట్ల రూపాయల అద్దెలు వసూలు చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు బీఆర్ఎస్ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.
గత నెలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిరిసిల్ల పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నాయకులు సమాధానం చెప్పలేకపోయారని అన్నారు. ఇప్పుడు సిద్దిపేట వేదికగా గత ప్రభుత్వ పాలనలో జరిగిన వైఫల్యాలు, అక్రమాలను ప్రజల ముందుంచుతామని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుకు కృషి చేస్తోందని పేర్కొన్నారు. సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ కుటుంబ బీమా, చీరల పంపిణీతో పాటు రహదారుల అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నామని వివరించారు.
ఈ నెల 19న సిద్దిపేటలో నిర్వహించనున్న బహిరంగ సభలో చీరల పంపిణీతో పాటు ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి సభకు భారీగా ప్రజలను తరలించేందుకు కాంగ్రెస్ శ్రేణులు కార్యాచరణ రూపొందిస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సహా జిల్లాలోని ముఖ్య నాయకులందరూ సమన్వయంతో పనిచేసి, సభను విజయవంతం చేయాలని కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు.
గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను సరిదిద్దడంతో పాటు, బాధ్యులను ప్రజల ముందు నిలబెట్టడమే తమ ప్రభుత్వ లక్ష్యమని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో సిరిసిల్ల, సిద్దిపేట నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ, నియోజకవర్గ ఇన్చార్జి కెకె మహేందర్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర దేవరాజు, నాయకులు ఆకునూరి బాలరాజు, అఫ్ఫాన్, రఫీక్ తదితరులు పాల్గొన్నారు.




