Sircilla: టీబీ నిర్మూలనకు వ్యాధి గుర్తింపు, ఫాలోఅప్‌పై ప్రత్యేక దృష్టి!

Sircilla: టీబీ నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించాలని రాజన్న సిరిసిల్ల డీఎంహెచ్‌ఓ ఆదేశించారు. తనిఖీల్లో లోపాలపై సిరి ఆసుపత్రికి షోకాజ్ నోటీసు ఇచ్చారు.

KALEEM, SIRICILLA
Published on: 27 Nov 2026 6:15 PM IST
Sircilla
X

Sircilla: టీబీ నిర్మూలనకు వ్యాధి గుర్తింపు, ఫాలోఅప్‌పై ప్రత్యేక దృష్టి!

రాజన్న సిరిసిల్ల జిల్లా: రాజన్న సిరిసిల్ల జిల్లాలో క్షయ వ్యాధి (టీబీ) నిర్మూలన లక్ష్యంగా వ్యాధి గుర్తింపు, నిర్ధారణ, చికిత్సతో పాటు రోగుల ఫాలోఅప్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ వైద్య సిబ్బందికి సూచించారు.

ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వేములవాడ, సిరిసిల్ల పట్టణాల్లోని ప్రైవేట్ ఆసుపత్రులను సందర్శించి వైద్య సేవలు, ఆసుపత్రుల నిర్వహణ, సంబంధిత రికార్డులను పరిశీలించారు. అనంతరం హన్మాజీపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని వట్టెముల గ్రామంలో నిర్వహించిన టీబీ ఎక్స్‌రే క్యాంపును సందర్శించి పరీక్షల నిర్వహణను పరిశీలించారు. టీబీ లక్షణాలు ఉన్నవారిని గుర్తించి అవసరమైన నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని సూచించారు. వ్యాధి నిర్ధారణ అయిన ప్రతి ఒక్కరికీ వెంటనే చికిత్స ప్రారంభించాలని, చికిత్స పూర్తయ్యే వరకు వైద్య సిబ్బంది నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. గుర్తించిన కేసుల వివరాలను నమోదు చేసి క్రమం తప్పకుండా ఫాలోఅప్ చేయాలని స్పష్టం చేశారు.

అనంతరం సిరిసిల్ల పట్టణంలోని సిరి ఆసుపత్రి, కనెక్ట్ డయాగ్నోస్టిక్ సెంటర్లను సందర్శించి పీసీపీఎన్‌డీటీ (PCPNDT) చట్టం అమలుకు సంబంధించిన రికార్డులు, రిజిస్టర్లు, ఇతర నిబంధనలను తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో నిబంధనల అమలులో లోపాలు గుర్తించడంతో సిరి ఆసుపత్రికి పీసీపీఎన్‌డీటీ చట్టం ప్రకారం షోకాజ్ నోటీసు జారీ చేశారు. సంబంధిత నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, ఉల్లంఘనలకు పాల్పడితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

జిల్లాలోని అన్ని ప్రైవేట్ ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్ కేంద్రాలు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వైద్య సేవలు అందించాలని, రోగులకు నాణ్యమైన వైద్యం అందించడంతో పాటు సంబంధిత చట్టాలు, నిబంధనలను కచ్చితంగా పాటించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సూచించారు.

ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి డాక్టర్ సంపత్ కుమార్, డాక్టర్ దివ్యశ్రీ, మహేష్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA