Sircilla: విక్రమ్-1 రాకెట్ ప్రయోగంలో సిరిసిల్ల ఇంజినీర్ల సత్తా
Sircilla: అంతరిక్ష రంగంలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ముగ్గురు యువ ఇంజినీర్లు అద్భుత ప్రతిభ చాటారు.
Sircilla: విక్రమ్-1 రాకెట్ ప్రయోగంలో సిరిసిల్ల ఇంజినీర్ల సత్తా
సిరిసిల్ల: అంతర్జాతీయ అంతరిక్ష రంగంలో సిరిసిల్ల యువ ఇంజినీర్లు తమ ప్రతిభను చాటారు. శ్రీహరికోటలో విజయవంతంగా ప్రయోగించిన ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్-1 మిషన్‌లో రాజన్న సిరిసిల్లకు చెందిన ముగ్గురు ఇంజినీర్లు కీలక పాత్ర పోషించడం జిల్లాకు గర్వకారణంగా నిలిచింది.
సిరిసిల్ల పట్టణానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన అడుప సంతోష్ కుమార్, అడుప కిరణ్, బొమ్మదేని నాగరాజు హైదరాబాద్‌కు చెందిన ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ రూపొందించిన విక్రమ్-1 ప్రయోగంలో తమ ప్రతిభను చాటారు.
అవియానిక్స్ చెక్‌అవుట్ లీడ్‌గా అడుప సంతోష్ కుమార్, రాకెట్ క్యాడ్ డిజైనర్‌గా అడుప కిరణ్, ఎలక్ట్రికల్ ఇంటిగ్రేషన్ విభాగంలో బొమ్మదేని నాగరాజు కీలక బాధ్యతలు నిర్వహించారు. వీరి కృషితో విక్రమ్-1 తొలి ప్రయత్నంలోనే ఉపగ్రహాలను దిగువ భూ కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టింది.
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యువ ఇంజినీర్లు భారత అంతరిక్ష విజయగాథలో భాగస్వాములు కావడం పట్ల సిరిసిల్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. యువతకు ఆదర్శంగా నిలిచిన ఈ ముగ్గురిపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.




