Sircilla: సిరిసిల్ల మానేరు తీరంలో ఘనంగా రావణ దహనం

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మానేరు తీరం బతుకమ్మ ఘాట్ వద్ద హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో రావణ దహనం, శమీ పూజ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి.

KALEEM, SIRICILLA
Published on: 20 Oct 2026 9:52 PM IST
Sircilla
X

Sircilla: సిరిసిల్ల మానేరు తీరంలో ఘనంగా రావణ దహనం

రాజన్న సిరిసిల్ల జిల్లా: రాజన్న సిరిసిల్ల జిల్లాలో విజయదశమి వేడుకలు ఘనంగా జరిగాయి. చెడుపై మంచి, అన్యాయంపై న్యాయం విజయం సాధిస్తాయనే సందేశంతో జిల్లా ప్రజలు దసరా పండుగను భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. ఉదయం నుంచే ఆలయాలకు తరలివచ్చిన భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇళ్లలో ఆయుధ పూజలు, వాహన పూజలు చేపట్టారు. సంప్రదాయంలో భాగంగా జమ్మి చెట్టుకు పూజలు చేసి, జమ్మి ఆకులను బంగారంగా భావిస్తూ పెద్దలకు అందజేసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. బంధుమిత్రులను కలుసుకొని దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

సిరిసిల్ల పట్టణంలోని మానేరు నది తీరాన గల బతుకమ్మ ఘాటు వద్ద హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో రావణ దహన కార్యక్రమం నిర్వహించారు. ముదిరాజ్ కులస్తులు తమ సంప్రదాయం ప్రకారం డప్పు చప్పుళ్లతో జమ్మి చెట్టును తీసుకొచ్చి, బతుకమ్మ ఘాటు వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్థలంలో ప్రతిష్ఠించారు.

అనంతరం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారు ఆశ్వవాహనంపై పురవీధుల గుండా ఊరేగింపుగా శమీ దర్శనానికి మానేరు నది తీరానికి చేరుకున్నారు. అక్కడ జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించి, జమ్మి ఆకులను స్వీకరించిన అనంతరం తిరుగు ప్రయాణమయ్యారు.

అనంతరం సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి. గితే, డీఎస్పీ నాగేంద్ర చారి ఆధ్వర్యంలో రావణ దహన కార్యక్రమం నిర్వహించారు. సిరిసిల్ల మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ ఆడెపు రవీందర్ రాముడి వేషధారణలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రాముడి వేషంలో రావణాసురుడిపై రామబాణం సంధించి వధించిన ఘట్టాన్ని ప్రేక్షకులు ఆసక్తిగా తిలకించారు.

రావణ దహనం అనంతరం ప్రజలు జమ్మి ఆకులను పరస్పరం ఇచ్చిపుచ్చుకుంటూ, ఆలింగనం చేసుకొని దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. తమ కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ జమ్మి ఆకులను బంగారంగా భావించి పంచుకున్నారు. దీంతో సిరిసిల్ల మానేరు నది తీరం జనసంద్రంగా మారింది. హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA