Sircilla: సిరిసిల్ల దసరా వేడుకలకు ప్రత్యేక గుర్తింపు గుడ్ల జ్యోతి కిరణ్

Sircilla: సిరిసిల్లలో దుర్గాదేవి మండపాలను సందర్శించి పూజలు చేసిన గుడ్ల జ్యోతి కిరణ్. సిరిసిల్ల దసరా వేడుకలు, ఐదవ రోజు రథోత్సవం ప్రత్యేక గుర్తింపు పొందాయని వెల్లడి.

KALEEM, SIRICILLA
Published on: 19 Oct 2026 5:17 PM IST
Sircilla
X

Sircilla: సిరిసిల్ల దసరా వేడుకలకు ప్రత్యేక గుర్తింపు గుడ్ల జ్యోతి కిరణ్

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన పలు దుర్గాదేవి మండపాలను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి, హైకోర్టు సీనియర్ న్యాయవాది గుడ్ల జ్యోతి కిరణ్ పలువురు కాంగ్రెస్ నాయకులతో కలిసి సందర్శించారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం బతుకమ్మ, దసరా పండుగలకు సిరిసిల్లకు వచ్చి ఇక్కడే వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉంటుందని తెలిపారు. చిన్నతనంలో తన అన్నయ్యతో కలిసి బతుకమ్మ కోసం పూలు సేకరించిన జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. సిరిసిల్ల గర్ల్స్ హైస్కూల్‌తో తనకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు.

తెలంగాణలోని ప్రతి గ్రామంలో బతుకమ్మ, దసరా వేడుకలు వైభవంగా జరుగుతాయని, సిరిసిల్లలో మాత్రం దసరా ఉత్సవాలకు ప్రత్యేక గుర్తింపు ఉందని పేర్కొన్నారు. బతుకమ్మ, దసరా వేడుకల అనంతరం ఐదవ రోజు జరిగే రథోత్సవం వరకు పట్టణంలో పండుగ సందడి కొనసాగడం సిరిసిల్ల ప్రత్యేకత అని తెలిపారు.

ఎమ్మెల్సీగా అవకాశం కోసం తన ప్రయత్నాలు కొనసాగుతున్నాయని గుడ్ల జ్యోతి కిరణ్ వెల్లడించారు. ఎమ్మెల్సీగా అవకాశం లభిస్తే సిరిసిల్లలోనే ఉంటూ ప్రజలకు మరింత చేరువగా సేవలందించేందుకు కృషి చేస్తానని చెప్పారు. సిరిసిల్లలో పుట్టి పెరిగిన తనకు ఈ ప్రాంతంతో ఉన్న అనుబంధం, ఇక్కడి ప్రజలు, పండుగలు, చిన్ననాటి జ్ఞాపకాలు ఎప్పటికీ ప్రత్యేకమని పేర్కొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA