Sircilla: హమాలీ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో హమాలీ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు, ఉచిత హెల్త్ కార్డులు అందించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో హమాలీ కార్మికులు భారీ ధర్నా.
Sircilla: హమాలీ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి
సిరిసిల్ల: సిరిసిల్ల జిల్లా కేంద్రంలో హమాలీ కార్మికులు ఆందోళనకు దిగారు. ఎన్నికల హామీ మేరకు వెంటనే హమాలీ వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ CITU అనుబంధ ఆల్ మండల్స్ హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టరేట్ ఏఓకు అందజేశారు.
మార్కెట్ యార్డులు, సివిల్ సప్లైస్, రైస్ మిల్లులు, గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజీలు, బజార్ ముఠా రంగాల్లో రాత్రింబవళ్లు పనిచేస్తున్న హమాలీ కార్మికులు తమ హక్కుల కోసం గళమెత్తారు. నిత్యావసర సరుకులను ప్రజలకు చేరవేయడంలో కీలకంగా పనిచేస్తున్న తమను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు గడుస్తున్నా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హమాలీ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు, ఉచిత హెల్త్ కార్డుల పంపిణీ హామీలు అమలు కాలేదని కార్మిక సంఘాల నాయకులు ఆరోపించారు. నిత్యావసరాల ధరలు పెరుగుతున్నప్పటికీ కూలీ రేట్లు పెరగకపోవడంతో కార్మిక కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు.
ప్రభుత్వం వెంటనే హమాలీ వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేసి, ఉచిత హెల్త్ కార్డులు అందించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.




