Sircilla: రాకేష్ వైద్య ఖర్చులకు బండి సంజయ్ ఆర్థిక సాయం!
Sircilla: సిరిసిల్ల ఆసుపత్రిలో పచ్చకామెర్లతో చికిత్స పొందుతున్న మరిపెల్లి రాకేష్‌కు కేంద్ర మంత్రి బండి సంజయ్ రూ.50 వేల ఆర్థిక సాయం ప్రకటించారు. జిల్లా అధ్యక్షుడు గోపి నగదును అందజేశారు.
Sircilla: రాకేష్ వైద్య ఖర్చులకు బండి సంజయ్ ఆర్థిక సాయం!
రాజన్న సిరిసిల్ల జిల్లా: తీవ్రమైన పచ్చకామెర్ల వ్యాధితో బాధపడుతూ సిరిసిల్ల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చందుర్తి మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన మరిపెల్లి రాకేష్ (34) కుటుంబానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆర్థిక సహాయం అందించారు.
రాకేష్ అనారోగ్య పరిస్థితి, కుటుంబం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల గురించి తెలుసుకున్న బండి సంజయ్ కుమార్ తక్షణమే స్పందించి వైద్య ఖర్చుల నిమిత్తం రూ.50 వేల ఆర్థిక సహాయం ప్రకటించారు. ఆయన పంపించిన నగదును బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి శనివారం ఆసుపత్రిలో బాధిత కుటుంబానికి అందజేశారు.
ఈ సందర్భంగా రెడ్డబోయిన గోపి మాట్లాడుతూ.. పేదరికం కారణంగా వైద్య ఖర్చులు భరించలేక ఇబ్బందులు పడుతున్న రాకేష్ కుటుంబానికి బండి సంజయ్ అందించిన ఆర్థిక సహాయం కొండంత అండగా నిలుస్తుందని తెలిపారు. అనంతరం ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి రాకేష్‌కు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. రాకేష్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
సకాలంలో స్పందించి ఆర్థిక సహాయం అందించిన బండి సంజయ్ కుమార్‌కు రాకేష్ కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిరికొండ శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షుడు మార్త సత్తయ్య, చందుర్తి మండల అధ్యక్షుడు మోకిలి విజయేందర్, సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్‌తో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




