Illanthakunta: కామ్రేడ్ మల్లేశం కుటుంబాన్ని పరామర్శించిన చాడ వెంకట్ రెడ్డి!
Illanthakunta: ఇల్లంతకుంటలో మృతి చెందిన సీపీఐ నేత మల్లేశం కుటుంబాన్ని చాడ వెంకట్ రెడ్డి పరామర్శించారు. సిరిసిల్లను కరువు జిల్లాగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
Illanthakunta: కామ్రేడ్ మల్లేశం కుటుంబాన్ని పరామర్శించిన చాడ వెంకట్ రెడ్డి!
ఇల్లంతకుంట: రాజన్న సిరిసిల్ల జిల్లా, ఇల్లంతకుంట మండలంలోని తాళ్లపెల్లి గ్రామంలో ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన సీపీఐ సీనియర్ నాయకులు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ శ్రావణపెల్లి మల్లేశం కుటుంబాన్ని సీపీఐ సీనియర్ నాయకులు, ఇందుర్తి మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్ రెడ్డి పరామర్శించారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కసిరెడ్డి మణికంఠ రెడ్డి కూడా ఆయన వెంట ఉన్నారు.
ఈ సందర్భంగా చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. దోపిడీ, అణచివేత, అసమానతలు, శ్రమ దోపిడీ ఉన్నంతకాలం ప్రజా పోరాటాలు కొనసాగుతాయని అన్నారు. భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ ఎర్రజెండా ప్రస్థానం వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో అనేక పార్టీలు కనుమరుగైనా, శ్రమజీవుల రక్తంతో ఎరుపెక్కిన ఎర్రజెండా మరింత ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.
దళిత కుటుంబంలో జన్మించిన కామ్రేడ్ శ్రావణపెల్లి మల్లేశం శ్రమజీవులు, కార్మికుల హక్కుల కోసం అనేక సంవత్సరాలుగా పోరాడారని గుర్తుచేశారు. సీపీఐ ఇల్లంతకుంట మండల కార్యదర్శిగా, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులుగా, హమాలీ సంఘం నాయకులుగా ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు సాగించారని కొనియాడారు. మల్లేశం కుటుంబానికి పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
*ఎలినో ప్రభావంతో రైతులు నష్టపోతున్నారు.. కరువు జిల్లాగా ప్రకటించాలి*
ఎలినో ప్రభావంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో వ్యవసాయం తీవ్రంగా దెబ్బతింటోందని చాడ వెంకట్ రెడ్డి అన్నారు. జిల్లాలోని కొన్ని ప్రాంతాలను ప్రభుత్వం ఇప్పటికే కరువు ప్రాంతాలుగా ప్రకటించిందని పేర్కొన్నారు. ఇల్లంతకుంట మండలం కరువు ప్రాంత పరిధిలోని కందికట్కూర్ గ్రామానికి చెందిన రైతు సావనపెల్లి పరశురాముడు 15 ఎకరాలు కౌలుకు తీసుకొని సాగు చేయగా, నీరు అందక పంట పూర్తిగా ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. పక్కనే మిడ్ మానేరు జలాశయం ఉన్నప్పటికీ కరువు పరిస్థితులు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి, కేంద్ర ప్రభుత్వంతో చర్చించి తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు.
*వెంకట్రావుపల్లె, గొల్లపల్లి గ్రామాల సరిహద్దు వివాదాన్ని పరిష్కరించాలి*
వెంకట్రావుపల్లె, గొల్లపల్లి గ్రామాల మధ్య 2018 నుంచి కొనసాగుతున్న సరిహద్దు వివాదాన్ని గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం పరిష్కరించకపోవడం సరికాదని చాడ వెంకట్ రెడ్డి అన్నారు. ఇరు గ్రామాల మధ్య ఎలాంటి వివాదాలు లేకుండా అధికారులు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.
ఈ మేరకు సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మంద అనిల్ కుమార్ ఆధ్వర్యంలో వెంకట్రావుపల్లె గ్రామ సర్పంచ్, పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు చాడ వెంకట్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి మంద సుదర్శన్, జిల్లా కార్యవర్గ సభ్యులు కడారి రాములు, మంద అనిల్ కుమార్, మండల కార్యదర్శి తీపిరెడ్డి తిరుపతి రెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.




