Thangallapalli: అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ బీమా అందాలి
Thangallapalli: రాజన్న సిరిసిల్ల జిల్లా మండేపల్లిలో ఇందిరమ్మ జీవిత బీమా పథకం అమలు తీరును పరిశీలించిన మార్కెట్ కమిటీ చైర్మన్ సత్తు శ్రీనివాస్ రెడ్డి; 100% నమోదుకు ఆదేశం.
Thangallapalli: అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ బీమా అందాలి
తంగళ్లపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండేపల్లి గ్రామంలో ఇందిరమ్మ జీవిత బీమా పథకం అమలు తీరును సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్మన్ సత్తు శ్రీనివాస్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎంపీడీవో రమేష్, గ్రామ సర్పంచ్ గాధగోని సాగర్తో కలిసి గ్రామంలో పర్యటించి, పథకం కింద అర్హులైన కుటుంబాల గుర్తింపు, దరఖాస్తుల నమోదు ప్రక్రియను అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా సత్తు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. కుటుంబ పెద్దను కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే పేద కుటుంబాలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు. సాంకేతిక కారణాలతో అర్హులైన ఏ ఒక్క కుటుంబం కూడా పథకానికి దూరం కాకూడదని, అర్హులైన ప్రతి కుటుంబానికి బీమా ప్రయోజనం అందేలా చూడాలని అధికారులకు సూచించారు. వంద శాతం నమోదు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
మండేపల్లి గ్రామ ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఇంకా వివరాలు నమోదు చేసుకోని అర్హులైన కుటుంబాలు వెంటనే గ్రామ పంచాయతీ సిబ్బందిని సంప్రదించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, మండల అధికారులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.




