Sircilla: సిరిసిల్లలో ఘోరం పోలీస్ స్టేషన్‌లో బాధితుడి ఆత్మహత్యాయత్నం!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆరున్నర గుంటల భూవివాదంలో న్యాయం జరగలేదని బాధితుడు నవీన్ పోలీస్ స్టేషన్‌లో నిద్రమాత్రలు మింగి కుప్పకూలాడు.
Sircilla: సిరిసిల్లలో ఘోరం పోలీస్ స్టేషన్‌లో బాధితుడి ఆత్మహత్యాయత్నం!
రాజన్న సిరిసిల్ల జిల్లా:
రాజన్న సిరిసిల్లలో భూ వివాదం.. న్యాయం జరగలేదంటూ బాధితుడి ఆత్మహత్యాయత్నం
రాజన్న సిరిసిల్ల జిల్లాలో భూ వివాదం తీవ్ర కలకలం రేపింది. ఒకే భూమిని ఇద్దరికి విక్రయించారని ఆరోపిస్తూ న్యాయం కోసం ఏడాదికిపైగా తిరిగిన బాధితుడు మనస్తాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. నిద్రమాత్రలు మింగిన అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే పోలీసులు అతడిని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు.
బాధితుడు గాజుల నవీన్ తెలిపిన వివరాల ప్రకారం... రెండేళ్ల క్రితం సిరిసిల్ల పట్టణంలోని భవానీనగర్‌లో ఆరున్నర గుంటల భూమిని రూ.34 లక్షలకు కొనుగోలు చేశాడు. ఆ భూమి తన పేరుపై రిజిస్ట్రేషన్ కూడా పూర్తయిందని పేర్కొన్నాడు.
అయితే ఏడాది తర్వాత స్థలానికి కంచె వేయడానికి వెళ్లిన సమయంలో అదే భూమిలో మూడు గుంటలు ఇప్పటికే 2012లో తన పేరుపై రిజిస్ట్రేషన్ అయ్యాయని మరో వ్యక్తి పత్రాలు చూపించడంతో తాను మోసపోయినట్లు తెలిసిందని ఆరోపించాడు.
దీంతో భూమిని విక్రయించిన వ్యక్తిని సంప్రదించి తన డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరినా స్పందించలేదని నవీన్ తెలిపాడు. రెండు నెలల క్రితం విక్రేత ఇంటికి వెళ్లగా తనపై దాడి జరిగిందని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ న్యాయం జరగలేదని ఆరోపించాడు.
తనకు రావాల్సిన రూ.16 లక్షలకు బదులుగా కేవలం రూ.3 లక్షలు మాత్రమే ఇస్తామని ఒత్తిడి చేస్తున్నారని, ఏడాదిగా పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీలు జరిగినా సమస్యకు పరిష్కారం లభించలేదని వాపోయాడు.
ఈ పరిణామాలతో తీవ్ర మనస్తాపానికి గురైన నవీన్ నిద్రమాత్రలు మింగి పోలీస్ స్టేషన్‌కు చేరుకోగా అక్కడే అస్వస్థతకు గురై కుప్పకూలిపోయాడు. వెంటనే పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి అంబులెన్స్‌లో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.
కాగా, భూ మోసం, దాడి, డబ్బుల వ్యవహారాలకు సంబంధించిన ఆరోపణలపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఈ ఘటనపై అధికారుల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.




