Sircilla: సిరిసిల్ల మానేరు వాగు వంతెనపై లారీ బీభత్సం.. ఇద్దరికి తీవ్రగాయాలు
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా మానేరు వాగు వంతెనపై వినాయక నిమజ్జనం చూస్తున్న వారిపైకి లారీ దూసుకెళ్లిన ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
Sircilla: సిరిసిల్ల మానేరు వాగు వంతెనపై లారీ బీభత్సం.. ఇద్దరికి తీవ్రగాయాలు
రాజన్న సిరిసిల్ల జిల్లా: సిరిసిల్లలో వినాయక నిమజ్జన వేడుకల సందర్భంగా మానేరు వాగు వంతెనపై ప్రమాదం చోటుచేసుకుంది. వంతెనపై ద్విచక్ర వాహనాలను నిలిపి నిమజ్జన వేడుకలను వీక్షిస్తున్న వారిపైకి ఓ లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో సిరిసిల్ల పట్టణానికి చెందిన కరుణాకర్ రెడ్డి, సల్మాన్ అనే ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడగా.. మరో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి.
వినాయక నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా మానేరు వాగు పరిసరాల్లో సందడి నెలకొంది. నిమజ్జనాన్ని వీక్షించేందుకు పలువురు వాహనదారులు తమ ద్విచక్ర వాహనాలను మానేరు వాగు వంతెనపై నిలిపారు. ఈ క్రమంలో వేగంగా వచ్చిన ఓ లారీ ఒక్కసారిగా అదుపుతప్పి అక్కడ ఉన్న వారిపైకి దూసుకెళ్లింది.
లారీ ఢీకొనడంతో కరుణాకర్ రెడ్డి, సల్మాన్ తీవ్రంగా గాయపడ్డారు. మరో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులను 108 వాహనంలో సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
ప్రమాదం అనంతరం లారీ డ్రైవర్ వాహనంతో అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు లారీ కోసం గాలింపు చేపట్టారు. అనంతరం లారీని గుర్తించి పట్టుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు.
ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.




