Sircilla: కొత్తచెరువు నాలాల పునరుద్ధరణకు రేపు మున్సిపల్ ఆఫీస్ ముట్టడి

Sircilla: కొత్తచెరువు నాలాల పునరుద్ధరణ, రోడ్డం నాలా తెరవాలని డిమాండ్ చేస్తూ శనివారం సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయం ముట్టడించనున్నట్లు సోమిశెట్టి దశరథం తెలిపారు.

KALEEM, SIRICILLA
Published on: 13 Nov 2026 5:42 PM IST
Sircilla
X

Sircilla: కొత్తచెరువు నాలాల పునరుద్ధరణకు రేపు మున్సిపల్ ఆఫీస్ ముట్టడి

రాజన్న సిరిసిల్ల జిల్లా: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కొత్తచెరువు నాలాలను పునరుద్ధరించాలని, గతంలో ఉన్న సహజ నాలాల ద్వారా చెరువు నీరు యథావిధిగా ప్రవహించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రేపు (శనివారం) ఉదయం 11 గంటలకు సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా, ముట్టడి కార్యక్రమం నిర్వహించనున్నట్లు AIFTU న్యూ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కామ్రేడ్ సోమిశెట్టి దశరథం తెలిపారు.

గత కొద్ది రోజులుగా ఈ సమస్యలపై ఆందోళనలు కొనసాగిస్తున్నామని, శ్రీనగర్ కాలనీ, శాంతినగర్ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారులు పరిష్కరించాలని నాయకులు కోరారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన శ్రీనగర్ కాలనీ కచ్చా కాలువను రద్దు చేయాలని, సర్వే నంబర్ 39లోని రోడ్డం నాలాను తెరిచి గతంలో మాదిరిగా సహజ నాలాల ద్వారా కొత్తచెరువు నీరు ప్రవహించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అలాగే చంద్రంపేట ఎక్స్‌రోడ్ నుంచి సిరిసిల్ల మొదటి బైపాస్‌ను కలిపే రోడ్డు పనులను పూర్తి చేయాలని, సర్వే నంబర్లు 71, 72లో విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని కోరారు. 22-ఏ జాబితాలోని పేదల ప్లాట్లపై ఉన్న నిషేధాన్ని తొలగించాలని, మున్సిపాలిటీకి లేఔట్‌లో భాగంగా కేటాయించిన సుమారు 10 గుంటలకు పైగా భూమిని స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ సమస్యల పరిష్కారం కోసం నిర్వహించనున్న మున్సిపల్ కార్యాలయం ముట్టడి కార్యక్రమంలో శ్రీనగర్ కాలనీ, శాంతినగర్ ప్రజలు, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని సోమిశెట్టి దశరథంతో పాటు నాయకులు కొండ శ్యామ్, ఆకున సత్తయ్య, బొల్లబత్తిని ఎల్లయ్య, గుజ్జ దేవదాసు పిలుపునిచ్చారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA