Sircilla: సిరిసిల్లలో మున్సిపల్ కార్మికుల నిరవధిక సమ్మె విరమణ!

Sircilla: రాజన్న సిరిసిల్ల మున్సిపాలిటీలో పీఎఫ్ బకాయిలు, ఉద్యోగ ప్రాధాన్యత డిమాండ్లపై అధికారుల సానుకూల హామీతో 3 రోజుల సమ్మె విరమించిన మున్సిపల్ కార్మికులు.

KALEEM, SIRICILLA
Published on: 7 Nov 2026 2:19 PM IST
Sircilla
X

Sircilla: సిరిసిల్లలో మున్సిపల్ కార్మికుల నిరవధిక సమ్మె విరమణ!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మున్సిపాలిటీలో గత మూడు రోజులుగా కొనసాగుతున్న మున్సిపల్ కార్మికుల నిరవధిక సమ్మె ముగిసింది. మున్సిపల్ కమిషనర్, చైర్మన్, వైస్ చైర్మన్ సమక్షంలో కార్మిక సంఘాల నాయకులతో జరిపిన చర్చలు సఫలం కావడంతో కార్మికులు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు.

తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కార్మికులు మూడు రోజులుగా విధులను బహిష్కరించి సమ్మె చేపట్టారు. ఈ నేపథ్యంలో అధికారులు, కార్మిక సంఘాల నాయకుల మధ్య జరిగిన చర్చల్లో పలు డిమాండ్లపై సానుకూల స్పందన లభించింది.

ఇటీవల మృతి చెందిన కార్మికులు, 60 ఏళ్లు నిండిన కార్మికుల స్థానాల్లో వారి కుటుంబ సభ్యులకు తాత్కాలిక నియామకాల్లో మొదటి ప్రాధాన్యత ఇస్తామని అధికారులు అంగీకరించారు. అలాగే 2009 నుంచి 2012 వరకు 118 మంది కార్మికులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న పీఎఫ్ సమస్యను ఒకటి నుంచి రెండు నెలల్లో పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

మరోవైపు పెండింగ్ పీఎఫ్ బకాయిలకు సంబంధించి రూ.1.50 లక్షల చెక్కును విడుదల చేసినట్లు కార్మిక సంఘాల నాయకులు వెల్లడించారు. మిగిలిన డిమాండ్లను కూడా పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చినట్లు తెలిపారు.

దీపావళి పండుగ నేపథ్యంలో పట్టణంలో చెత్తాచెదారం పేరుకుపోయి ప్రజలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో అధికారుల హామీ మేరకు సమ్మె విరమిస్తున్నట్లు కార్మిక సంఘాల నాయకులు ప్రకటించారు. దీంతో కార్మికులు తిరిగి విధులకు హాజరుకానున్నారు.

అయితే అధికారులు ఇచ్చిన హామీలను నిర్ణీత సమయంలో అమలు చేయాలని కార్మిక నాయకులు కోరారు. హామీలు నెరవేర్చకపోతే మరోసారి సమ్మెకు దిగేందుకు కార్మికులంతా సిద్ధంగా ఉంటారని స్పష్టం చేశారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA