Sircilla: సిరిసిల్లలో నేటి నుంచి మున్సిపల్ కార్మికుల సమ్మె!
Sircilla: దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం సిరిసిల్ల మున్సిపల్ కార్మికులు సమ్మెకు దిగుతున్నట్లు సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ వెల్లడించారు. పారిశుద్ధ్య పనులు స్తంభించనున్నాయి.
Sircilla: సిరిసిల్లలో నేటి నుంచి మున్సిపల్ కార్మికుల సమ్మె!
సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణంలో మున్సిపల్ కార్మికులు నేటి నుంచి విధులు బహిష్కరించి సమ్మెకు దిగనున్నారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న స్థానిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిరిసిల్ల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (CITU) ఈ సమ్మెకు పిలుపునిచ్చింది. దీంతో పట్టణంలో పారిశుద్ధ్య పనులు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడనుంది.
ఈ మేరకు సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్లో ఉన్న కామ్రేడ్ అమృత్ లాల్ శుక్లా కార్మిక భవన్‌లోని సీఐటీయూ జిల్లా కార్యాలయంలో యూనియన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ మాట్లాడుతూ.. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు మున్సిపల్ కార్మికులు అహర్నిశలు శ్రమిస్తున్నప్పటికీ, వారి దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని అన్నారు.
కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అక్టోబర్ 29న మున్సిపల్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి, వారం రోజుల్లో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. సమస్యలు పరిష్కరించకపోతే నవంబర్ 5 నుంచి విధులు బహిష్కరించి సమ్మె చేపడతామని మున్సిపల్ కమిషనర్‌కు ముందుగానే లేఖ అందజేశామని పేర్కొన్నారు. అయినప్పటికీ కమిషనర్ ఇప్పటివరకు కార్మికులతో కనీసం చర్చలు కూడా జరపలేదని విమర్శించారు.
నవంబర్ 5 ఉదయం నుంచి కార్మికులందరూ విధులకు హాజరుకాకుండా సమ్మెలో పాల్గొంటారని, ఉదయం 5 గంటలకే మున్సిపల్ కార్యాలయానికి చేరుకోవాలని పిలుపునిచ్చారు. సమ్మెకు మున్సిపల్ కమిషనర్, పాలకవర్గమే బాధ్యత వహించాలని కోడం రమణ అన్నారు. జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
కార్మికుల ప్రధాన డిమాండ్లు:
మున్సిపాలిటీలో పనిచేస్తూ మరణించిన, 60 సంవత్సరాలు పైబడి పదవీ విరమణ చేసిన కార్మికుల స్థానాల్లో వారి కుటుంబ సభ్యులకు ఉపాధి కల్పించాలని, అదనపు కార్మికులను నియమించి పని భారాన్ని తగ్గించాలని కోరారు.
2009 నుంచి 2012 వరకు 118 మంది కార్మికులకు సంబంధించిన పెండింగ్ పీఎఫ్ సమస్యను పరిష్కరించి వారి వ్యక్తిగత ఖాతాల్లో నగదు జమ చేయాలని డిమాండ్ చేశారు. రెండు బ్యాచ్‌లకు చెందిన 58 మంది కార్మికులతో పాటు విలీన గ్రామాల కార్మికుల పీఎఫ్ బకాయిలను కూడా చెల్లించాలని కోరారు.
సిరిసిల్ల పట్టణంలో పనిచేస్తున్న కార్మికులకు గతంలో మాదిరిగానే మున్సిపల్ కార్యాలయంలో హాజరు నమోదు చేయాలని, ఈ ఏడాదికి సంబంధించిన దుస్తులు, చెప్పులు, సబ్బులు, నూనెలు, గ్లౌజులు తదితర రక్షణ సామగ్రిని వెంటనే అందించాలని పేర్కొన్నారు.
కార్మికులందరికీ ఈఎస్ఐ, గుర్తింపు కార్డులు అందించి మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని, సాధారణ మరియు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. ప్రతి నెలా 5వ తేదీలోపు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు కాసారపు శంకర్‌తో పాటు నర్మెట బాబా కిషన్, బత్తుల దేవరాజు, మారుపాక లక్ష్మి, బడుగు శ్రీనివాస్, అర్జున్, మల్లేశం, దేవవ్వ తదితరులు పాల్గొన్నారు.




