Sircilla: సిరిసిల్ల రగుడు జంక్షన్ వద్ద రోడ్డు భద్రతపై పరిశీలన

Sircilla: సిరిసిల్ల రగుడు రౌండబౌట్ వద్ద ప్రమాదాల నివారణకు అధికారుల చర్యలు. స్పీడ్ బ్రేకర్లు, సూచిక బోర్డులు, లైటింగ్ ఏర్పాటుపై అధికారుల కీలక నిర్ణయాలు.

KALEEM, SIRICILLA
Published on: 14 July 2026 7:57 PM IST
Sircilla
X

Sircilla: సిరిసిల్ల రగుడు జంక్షన్ వద్ద రోడ్డు భద్రతపై పరిశీలన

సిరిసిల్ల: రగుడు రౌండబౌట్ జంక్షన్ వద్ద తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా రవాణా శాఖ, రోడ్లు & భవనాల శాఖ (ఆర్&బీ), మున్సిపల్ శాఖ, ట్రాఫిక్ పోలీసు శాఖ అధికారులు సంయుక్తంగా స్థల పరిశీలన నిర్వహించారు.

పరిశీలనలో భాగంగా రవాణా శాఖ అధికారి, ఆర్&బీ డీఈ, ఆర్టీఏ సభ్యుడు, మున్సిపల్ కమిషనర్, ట్రాఫిక్ ఎస్‌ఐతో పాటు సంబంధిత అధికారులు జంక్షన్‌ను క్షుణ్ణంగా పరిశీలించి ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు.

రౌండబౌట్‌కు ముందు అన్ని దిశల్లో రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేయడం, హెచ్చరిక, దిశా సూచిక, స్పీడ్ లిమిట్ బోర్డులు ఏర్పాటు చేయడం, రాత్రి వేళల్లో స్ట్రీట్ లైటింగ్ మెరుగుపరచడం, రౌండబౌట్‌ను ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేసి రిఫ్లెక్టివ్ మార్కింగ్‌లు, క్యాట్ ఐస్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలాగే థర్మోప్లాస్టిక్ రోడ్ మార్కింగ్‌లు, స్టాప్ లైన్లు, జీబ్రా క్రాసింగ్‌లు వేయడంతో పాటు జంక్షన్ వద్ద పొదలు, ఇతర అడ్డంకులు తొలగించి దృశ్యమానత పెంచాలని సూచించారు.

అవసరమైతే స్పీడ్ కాల్మింగ్ చర్యలు చేపట్టి అధిక వేగాన్ని నియంత్రించాలని, ట్రాఫిక్ రద్దీ సమయాల్లో ప్రత్యేక పోలీసు పర్యవేక్షణ ఉండాలని అధికారులు నిర్ణయించారు. భారీ వాహనాలు, ఆటోలు, ద్విచక్ర వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

ఈ సందర్భంగా అధికారులు వాహనదారులకు విజ్ఞప్తి చేస్తూ.. అధిక వేగంతో ప్రయాణించవద్దని, ట్రాఫిక్ సూచికలను తప్పనిసరిగా పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, కారులో ప్రయాణించే వారు సీటు బెల్ట్ వినియోగించాలని సూచించారు. ప్రజల సహకారంతోనే రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని అధికారులు తెలిపారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story