Sircilla: సిరిసిల్ల పోలీస్ స్టేషన్‌లో విద్యార్థులకు ఓపెన్ హౌస్!
Sircilla: సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఘనంగా ఓపెన్ హౌస్. ఆయుధాలు, షీ టీమ్స్, సీఈఐఆర్ సిస్టమ్‌లపై విద్యార్థులకు అవగాహన కల్పించిన ఎస్పీ మహేష్ బి. గితే!
Sircilla: సిరిసిల్ల పోలీస్ స్టేషన్‌లో విద్యార్థులకు ఓపెన్ హౌస్!
సిరిసిల్ల: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (పోలీస్ ఫ్లాగ్ డే)లో భాగంగా సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో విద్యార్థినీ, విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరుల త్యాగాలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే అన్నారు.
పోలీస్ శాఖ ప్రజలకు అందిస్తున్న సేవలు, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర, పోలీస్ స్టేషన్ పనితీరుపై విద్యార్థులకు అవగాహన కల్పించడమే ఓపెన్ హౌస్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ఎస్పీ తెలిపారు. విద్యతో పాటు సమాజంలో జరుగుతున్న పరిణామాలపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా పోలీస్ శాఖలోని వివిధ విభాగాల పనితీరు, విధులపై ప్రత్యేక స్టాళ్ల ద్వారా విద్యార్థులకు వివరించారు. డే, నైట్ బీట్స్, పెట్రోలింగ్, ఫిర్యాదుల స్వీకరణ, కేసుల నమోదు, దర్యాప్తు ప్రక్రియతో పాటు బాధితులకు న్యాయం అందించేందుకు పోలీసులు చేపట్టే చర్యలను వివరించారు.
నేరస్తులను గుర్తించేందుకు ఉపయోగించే ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్, పోర్టబుల్ ఫింగర్‌ప్రింట్ పరికరాలు, సీసీ కెమెరాల ప్రాధాన్యతను తెలియజేశారు. మహిళలు, విద్యార్థినుల రక్షణ కోసం పనిచేస్తున్న షీ టీమ్స్, భరోసా కేంద్రాల సేవలు, పోగొట్టుకున్న లేదా చోరీకి గురైన మొబైల్ ఫోన్లను గుర్తించి బ్లాక్ చేయడంతో పాటు తిరిగి పొందేందుకు ఉపయోగించే సీఈఐఆర్ వ్యవస్థ గురించి వివరించారు. బాంబ్ స్క్వాడ్ విధులు, పేలుడు పదార్థాలను గుర్తించి నిర్వీర్యం చేసే విధానం, పోలీస్ జాగిలాల సేవలను విద్యార్థులకు పరిచయం చేశారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని, మైనర్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని సూచించారు. ఆన్‌లైన్‌లో అపరిచితులతో పరిచయాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరానికి గురైతే వెంటనే 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఐటీ కోర్, భరోసా కేంద్రం, షీ టీమ్స్, ఫింగర్‌ప్రింట్స్, బాంబ్ స్క్వాడ్, కమ్యూనికేషన్ విభాగాల సిబ్బంది పాల్గొని పోలీస్ శాఖ విధులు, సేవలపై అవగాహన కల్పించారు. డీఎస్పీలు నాగేంద్రచారి, వెంకటేశ్వర్లు, సీఐ శ్రీనివాస్, ఎస్‌ఐలు గణేష్, అనిల్, రంజిత్, ఆర్‌ఎస్‌ఐ సాయి కిరణ్, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.




