Sircilla: నేరాల నియంత్రణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు.. ఎస్పీ!
Sircilla: ఎస్పీ మహేష్ బి. గితే బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో వేములవాడ సబ్‌డివిజన్ పోలీసు అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
Sircilla: నేరాల నియంత్రణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు.. ఎస్పీ!
సిరిసిల్ల: నేరాల నియంత్రణలో పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తూ సమర్థవంతమైన పోలీసింగ్‌ను అమలు చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే అధికారులను ఆదేశించారు.
బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో వేములవాడ సబ్‌డివిజన్ పోలీసు అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో శాంతిభద్రతలు, నేరాల నియంత్రణ, పెండింగ్ కేసుల దర్యాప్తు, ట్రాఫిక్ నిర్వహణ, సైబర్ నేరాల నివారణ, మాదక ద్రవ్యాల నిర్మూలన, పోలీసింగ్‌లో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం వంటి అంశాలపై ఎస్పీ సమగ్రంగా సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టి, శాస్త్రీయ ఆధారాలతో నేరస్తులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కేసుల దర్యాప్తులో నిర్లక్ష్యం వహించే అధికారులపై క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు.
సీసీటీఎన్‌ఎస్ 2.0, ఈ-సాక్ష్య, నాట్‌గ్రిడ్ వంటి ఆధునిక సాంకేతిక వనరులను వినియోగించి కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని సూచించారు. దొంగతనం కేసులను ప్రాధాన్యంగా తీసుకుని సీసీటీవీ ఫుటేజీలు, ఇతర సాంకేతిక ఆధారాల సహాయంతో త్వరగా ఛేదించి, బాధితులకు దొంగిలించిన సొత్తును తిరిగి అందజేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
సైబర్ నేరాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించడంతో పాటు మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని ఎస్పీ సూచించారు. అలాగే మద్యం సేవించి వాహనాలు నడపడం, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, ర్యాష్ డ్రైవింగ్ వంటి ఉల్లంఘనలపై ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.
ఈ సమావేశంలో డీఎస్పీలు శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, సీఐలు, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.




