Sircilla: ఆధ్యాత్మిక వేడుకల్లో పాల్గొనాలి: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్!

Sircilla: రాజన్న సిరిసిల్లలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి రథోత్సవం వైభవంగా జరిగింది. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

KALEEM, SIRICILLA
Published on: 26 Oct 2026 6:45 PM IST
Sircilla
X

Sircilla: ఆధ్యాత్మిక వేడుకల్లో పాల్గొనాలి: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్!

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం నిర్వహించిన స్వామివారి రథోత్సవం వైభవంగా జరిగింది. ఈ వేడుకలకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. మాడ వీధుల గుండా స్వామివారి రథోత్సవం సాగుతుండగా భక్తులు భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ రథోత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. స్వామివారి రథోత్సవంలో పాల్గొనడం ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. భక్తుల కోసం స్వామివారు రథంపై ఊరేగింపుగా వస్తున్నారనే విశ్వాసం, భక్తుల ముఖాల్లో కనిపించే ఆనందం, ఆధ్యాత్మిక భావన సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటిచెబుతాయని పేర్కొన్నారు. తరతరాలుగా వస్తున్న సంప్రదాయాలను కాపాడుకుంటూ భక్తిభావంతో ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.

కలియుగ దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామిని ఆరాధించడం మన సంస్కృతి, సంప్రదాయాల్లో విశిష్టమైన భాగమని తెలిపారు. ప్రతి సంవత్సరం నిర్వహించే బ్రహ్మోత్సవాలు, పూజలు, ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు లోకకల్యాణాన్ని ఆకాంక్షిస్తూ నిర్వహిస్తారని చెప్పారు. వేద పండితుల ఆధ్వర్యంలో జరిగే ఈ వేడుకలు ప్రజల్లో భక్తిభావాన్ని, ఆధ్యాత్మిక చింతనను పెంపొందిస్తాయని అన్నారు.

ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు పుష్కలంగా పండాలని, రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించినట్లు ఆది శ్రీనివాస్ తెలిపారు. ప్రకృతి విపత్తులు, ప్రతికూల పరిస్థితులు తొలగిపోయి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, స్వామివారి ఆశీస్సులు అందరికీ లభించాలని ఆకాంక్షించారు.

దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రం శైవ, వైష్ణవ సంప్రదాయాలకు నిలయంగా విరాజిల్లుతోందని పేర్కొన్నారు. రాజన్న ఆలయంతో పాటు సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రాచీన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వంటి పుణ్యక్షేత్రాలు ఈ ప్రాంత ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకలని అన్నారు.

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు విజయవంతంగా జరగడం సంతోషకరమని, స్వామివారి కృపతో ప్రజలందరికీ శాంతి, సౌభాగ్యం, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షిస్తూ భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA