Sircilla: వస్త్ర పరిశ్రమ అభివృద్ధి, కార్మికుల సంక్షేమమే లక్ష్యం ఆది శ్రీనివాస్!
Sircilla: సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వెల్లడి. కలెక్టరేట్‌లో సమీక్షా సమావేశం.
Sircilla: వస్త్ర పరిశ్రమ అభివృద్ధి, కార్మికుల సంక్షేమమే లక్ష్యం ఆది శ్రీనివాస్!
Sircilla: సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అభివృద్ధి, కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, విజయ రమణారావు, వేముల వీరేశం, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పరిశ్రమలు, వాణిజ్య, టెక్స్టైల్స్ సబ్య సాచి ఘోష్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్ సమావేశానికి హాజరయ్యారు.
సిరిసిల్ల చేనేత, జౌళి రంగం ప్రస్తుత పరిస్థితి, పవర్‌లూమ్ పరిశ్రమ అభివృద్ధి, వస్త్ర ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యాలు, కార్మికులకు ఉపాధి అవకాశాలు, మార్కెట్ విస్తరణ తదితర అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. వివిధ సంఘాల ప్రతినిధులు తమ సమస్యలు, సూచనలు, అభిప్రాయాలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు రూ.300 కోట్లకు పైగా బకాయిలు చెల్లించామని తెలిపారు. జిల్లాలోని 132 మ్యాక్స్ సంఘాలకు గత ఏడాది 6.86 కోట్ల మీటర్ల ఇందిరా మహిళా శక్తి చీరల ఆర్డర్లు ఇవ్వగా, ఈ ఏడాది 6.33 కోట్ల మీటర్ల ఆర్డర్లు ఇచ్చినట్లు వివరించారు. స్కూల్ యూనిఫాంలకు గత ఏడాది 1.03 కోట్ల మీటర్ల ఆర్డర్ ఇవ్వగా, ఈ ఏడాది దాదాపు 37 లక్షల మీటర్ల ఆర్డర్ ఇచ్చామని తెలిపారు.
వస్త్ర పరిశ్రమ బాధ్యులు, కార్మికులు ఉపాధి, భవిష్యత్తుపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. పరిశ్రమ అభివృద్ధి కోసం రూ.50 కోట్లతో యార్న్ బ్యాంక్ ఏర్పాటు చేసి క్రెడిట్‌పై యార్న్ అందిస్తున్నామని తెలిపారు. కామన్ ఫెసిలిటీ సెంటర్‌తో పాటు ఇతర వసతుల అంశాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని వెల్లడించారు.
సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఇందిరా మహిళా శక్తి చీరల ఉత్పత్తి ద్వారా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నామని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్య సాచి ఘోష్ తెలిపారు. వస్త్ర పరిశ్రమ ప్రతినిధులు సమావేశంలో ప్రస్తావించిన అన్ని అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఇప్పటికే పలు సమస్యలను పరిష్కరించామని, సమావేశంలో వచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకుని అవసరమైన చర్యల కోసం సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తామని తెలిపారు.
సమావేశంలో హ్యాండ్‌లూమ్స్ అండ్ టెక్స్‌టైల్స్ శాఖ అడిషనల్ డైరెక్టర్ ఎన్. వెంకటేశ్వర్ రావు, జాయింట్ డైరెక్టర్ ఇందుమతి, ఏడీ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.




