Sircilla: వీఎఫ్‌ఎక్స్ ఉద్యోగం వదిలి.. సిల్వర్ స్క్రీన్ హీరోగా!
Sircilla: వీఎఫ్‌ఎక్స్ ఉద్యోగం వదిలి సినిమాల్లోకి వెళ్లిన రాజన్న సిరిసిల్ల యువకుడు విద్యాసాగర్ సినీ ప్రయాణం.
Sircilla: వీఎఫ్‌ఎక్స్ ఉద్యోగం వదిలి.. సిల్వర్ స్క్రీన్ హీరోగా!
Sircilla: కలలను నిజం చేసుకోవాలంటే పట్టుదల, అంకితభావం ఉంటే ఏదైనా సాధ్యమేనని నిరూపిస్తున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన యువ నటుడు విద్యాసాగర్. వీఎఫ్‌ఎక్స్ రంగంలో మంచి ఉద్యోగాన్ని వదిలి నటనపై ఉన్న అభిరుచితో సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన ఆయన, నేడు వరుస చిత్రాలతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్నారు.
సిరిసిల్లలో పుట్టి పెరిగిన విద్యాసాగర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత హైదరాబాద్‌లో ప్రముఖ వీఎఫ్‌ఎక్స్ కంపెనీలో జూనియర్ ఆర్టిస్ట్‌గా చేరారు. తన ప్రతిభతో టీమ్ లీడర్, అనంతరం సూపర్‌వైజర్ స్థాయికి ఎదిగినా, చిన్ననాటి నుంచి ఉన్న నటనపై మక్కువ ఆయనను సినిమా రంగం వైపు నడిపించింది. ఉద్యోగానికి రాజీనామా చేసి థియేటర్ ఆర్ట్స్‌లో శిక్షణ పొందుతూ 'వాలి వధ', 'పరాయి' వంటి నాటకాలలో నటించారు.
ఆ తర్వాత షార్ట్ ఫిల్మ్స్, సినిమాల్లో అవకాశాల కోసం నిరంతరం ప్రయత్నించి 'జెర్సీ', 'కొత్త పోరడు' వంటి ప్రాజెక్టుల్లో అవకాశాలు అందుకున్నారు. కరోనా మహమ్మారి కారణంగా సినీ ప్రయాణానికి ఆటంకం ఎదురైనా, ధైర్యం కోల్పోకుండా మళ్లీ హైదరాబాద్ చేరుకుని తన ప్రయత్నాలను కొనసాగించారు.
దర్శకుడు వేణు యెల్దండి తెరకెక్కించిన 'బలగం' చిత్రం విద్యాసాగర్ సినీ జీవితంలో కీలక మలుపుగా నిలిచింది. ఆ సినిమా తర్వాత 'భీమదేవరపల్లి బ్రాంచి', 'సైతాన్' (వెబ్ సిరీస్), 'లగ్గం', 'సివరపల్లి', 'కేసీఆర్', 'కోర్ట్', 'బద్మాషులు', 'ఛాంపియన్', 'వీణ' చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.
ముఖ్యంగా 'బలగం', 'కోర్ట్', 'బద్మాషులు' చిత్రాల్లో ఆయన పోషించిన పాత్రలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం 'మారెమ్మ', 'ఇడుపు కాయితం', 'పళ్ళ బురుసు', 'అట్లాస్ సైకిల్' చిత్రాలతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
సిరిసిల్ల నుంచి సినీ పరిశ్రమలో అడుగుపెట్టి, తన ప్రతిభతో అవకాశాలను విజయాలుగా మలుచుకుంటున్న విద్యాసాగర్ ప్రయాణం యువతకు స్ఫూర్తిగా నిలుస్తోంది.




