Vemulawada: రైతుల సమక్షంలోనే భూముల రీసర్వే చేపట్టాలి
Vemulawada: రాజన్న సిరిసిల్ల జిల్లా జయవరంలో భూముల రీసర్వే ప్రక్రియను కలెక్టర్ గరిమ అగ్రవాల్ క్షేత్రస్థాయిలో పరిశీలించి, రైతుల సమక్షంలోనే సర్వే చేయాలని ఆదేశించారు.
Vemulawada: రైతుల సమక్షంలోనే భూముల రీసర్వే చేపట్టాలి
వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం జయవరంలో కొనసాగుతున్న భూముల రీ సర్వే ప్రక్రియను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సంబంధిత అధికారులతో కలిసి రోవర్ యంత్రాలు, డిజిటల్ పరికరాల ద్వారా నిర్వహిస్తున్న సర్వే పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భూముల రీ సర్వే ప్రక్రియను రైతుల సమక్షంలోనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గ్రామ పంచాయతీ అధికారులు, పంచాయతీ కార్యదర్శి, వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు ముందస్తుగా సమాచారం అందించి, రీ సర్వేపై అవగాహన కల్పించాలని సూచించారు. సర్వే సమయంలో రైతులకు వారి భూముల వివరాలను తెలియజేసి, సంబంధిత వివరాలపై వారి సంతకాలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
వ్యవసాయ, రెవెన్యూ, సర్వే శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ భూముల రీ సర్వే ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ పరిశీలనలో ఆర్డీఓ కే.ఎస్.బి. కుమారి, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాస్, తహసీల్దార్ శ్రీలత తదితరులు పాల్గొన్నారు.




