Vemulawada: ‘పీఎం రహత్’ కింద బాధితులకు రూ.1.50 లక్షల ఉచిత వైద్యం!
Vemulawada: వేములవాడ పోలీస్ స్టేషన్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ వాహనదారులకు ఎస్పీ మహేష్ బి. గితే కౌన్సెలింగ్ నిర్వహించి, పీఎం రహత్, రహ్వీర్ పథకాలపై అవగాహన కల్పించారు.
Vemulawada: ‘పీఎం రహత్’ కింద బాధితులకు రూ.1.50 లక్షల ఉచిత వైద్యం!
Vemulawada: మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల జరిగే రోడ్డు ప్రమాదాలను నివారించడంతో పాటు,వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్‌లో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈకార్యక్రమనికి జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే గారు హాజరై మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించి, వాహనదారులతో మద్యం సేవించి వాహనాలు నడపబోమని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తామని ప్రతిజ్ఞ చేయించారు.
ఈసందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ.మద్యం సేవించి వాహనం నడపడం వల్ల డ్రైవింగ్‌పై నియంత్రణ కోల్పోయి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, ఒక్కరి నిర్లక్ష్యం వారి ప్రాణాలతో పాటు రోడ్డుపై ప్రయాణించే ఇతరుల ప్రాణాలను సైతం ప్రమాదంలోకి నెట్టుతుందని అన్నారు.రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాల్లో మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగం, హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలు నడపడం, రాంగ్ రూట్‌లో ప్రయాణించడం, మైనర్ల డ్రైవింగ్ వంటివి ఉన్నాయని తెలిపారు.ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని సూచించారు.
అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలు, వాహనదారుల్లో చైతన్యం కల్పిస్తున్నామన్నారు.రోడ్డు ప్రమాద బాధితులకు సకాలంలో వైద్య సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన PM Rahat పథకం ద్వారా రూ.1.50 లక్షల వరకు నగదు రహిత వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని, ఈపథకం కింద జిల్లాలోని 7 ఆసుపత్రుల్లో వైద్య సేవలు పొందవచ్చని తెలిపారు.
అదేవిధంగా, Rah-Veer పథకం ద్వారా రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి బాధితులకు సహాయం అందించి, గోల్డెన్ అవర్‌లో ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడిన వారికి రూ.25,000 నగదు ప్రోత్సాహకం అందించడం జరుగుతుందని తెలిపారు.రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ సహాయం అందించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని, మానవత్వంతో స్పందించి విలువైన ప్రాణాలను కాపాడాలని ఎస్పీ గారు పిలుపునిచ్చారు.ఎస్పీ గారి వెంట సిఐ వీరప్రసాద్, ఎస్.ఐ లు ప్రేమనందం, శ్రీనివాస్, రాజు, పోలీస్ సిబ్బంది ఉన్నారు.




