Sircilla: భరోసా కేంద్రం ద్వారా బాధితులకు సత్వర సేవలు: ఎస్పీ మహేష్ బి. గితే!
Sircilla: భరోసా కేంద్రాన్ని ఎస్పీ మహేష్ బి. గితే సందర్శించారు. మహిళలు, చిన్నారుల రక్షణకు పోలీస్ శాఖ అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని, బాధితులకు సత్వర సేవలు అందించాలని ఆదేశించారు.
Sircilla: భరోసా కేంద్రం ద్వారా బాధితులకు సత్వర సేవలు: ఎస్పీ మహేష్ బి. గితే!
సిరిసిల్ల: మహిళలు, చిన్నారుల రక్షణకు పోలీస్ శాఖ అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు. లైంగిక, భౌతిక దాడులకు గురైన బాధితులకు భరోసా కేంద్రం ద్వారా సత్వర సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.
జిల్లా కేంద్రంలోని భరోసా కేంద్రాన్ని గురువారం జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే సందర్శించారు. ఈ సందర్భంగా బాధితులకు అందిస్తున్న న్యాయ సలహాలు, సైకలాజికల్ కౌన్సెలింగ్, వైద్యపరమైన సహాయం, మహిళల వేధింపులకు సంబంధించి నమోదవుతున్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
మహిళలు, చిన్నారులపై వేధింపులు, లైంగిక దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. భరోసా కేంద్రానికి వచ్చే ప్రతి బాధితురాలిని గౌరవప్రదంగా స్వాగతించి, వారి సమస్యలను పూర్తిగా తెలుసుకుని సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.
బాధితులకు తక్షణ సహాయంతో పాటు న్యాయ పరిరక్షణ, మానసిక ధైర్యాన్ని కల్పించడం అత్యంత కీలకమని ఎస్పీ పేర్కొన్నారు. భరోసా కేంద్రం అందిస్తున్న సేవలపై విద్యార్థులు, మహిళల్లో మరింత అవగాహన కల్పించేందుకు జిల్లావ్యాప్తంగా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
భరోసా కేంద్రం సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలని సిబ్బందికి ఎస్పీ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీసీఆర్బీ సీఐ మొగిలి, భరోసా సెంటర్ కోఆర్డినేటర్ ఎ. శిల్ప, లీగల్ సపోర్ట్ పర్సన్ లహారిక, సపోర్ట్ పర్సన్స్ స్వభావతి, రిచా, రిసెప్షనిస్ట్ మల్లేశ్వరి పాల్గొన్నారు.




