Jagtial: చెరువుల పనులను యుద్ధప్రాతిపదికన ప్రారంభించాలి: ఎమ్మెల్యే సంజయ్
Jagtial: జగిత్యాల పట్టణంలోని చింతకుంట, మోతె చెరువుల సుందరీకరణ పనులను యుద్ధప్రాతిపదికన ప్రారంభించాలని మున్సిపల్ అధికారులను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఆదేశించారు.
Jagtial: చెరువుల పనులను యుద్ధప్రాతిపదికన ప్రారంభించాలి: ఎమ్మెల్యే సంజయ్
జగిత్యాల: పట్టణంలోని చింతకుంట, మోతె చెరువుల అభివృద్ధి మరియు సుందరీకరణ పనులను ఏమాత్రం ఆలస్యం చేయకుండా యుద్ధప్రాతిపదికన ప్రారంభించాలని జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. జగిత్యాల మున్సిపల్ అధికారులతో నిర్వహించిన ప్రత్యేక సమీక్ష సమావేశంలో చెరువుల అభివృద్ధి పనుల పురోగతిపై ఆయన సుదీర్ఘంగా చర్చించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చింతకుంట, మోతె చెరువుల అభివృద్ధి పనులకు సంబంధించి 2025 డిసెంబర్లోనే టెండర్లు పూర్తయినప్పటికీ కాంట్రాక్టర్లు పనులు ప్రారంభించకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పనుల్లో ఆలస్యాన్ని సహించేది లేదని హెచ్చరించారు. ఎమ్మెల్యే ఆదేశాలపై స్పందించిన కాంట్రాక్టర్.. చింతకుంట చెరువు అభివృద్ధి పనులను మరో రెండు రోజుల్లోనే ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.
వ్యర్థ జలాలు చేరకుండా శాశ్వత పరిష్కారం:
ఇస్లాంపూర్ ప్రాంతం నుంచి మురుగునీరు, ఇళ్ల నుంచి వచ్చే వ్యర్థ జలాలు చింతకుంట చెరువులోకి చేరకుండా శాశ్వత పరిష్కారం చూపుతూ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.
మోతె చెరువుకు రూ.3 కోట్ల నిధులు:
అదేవిధంగా మోతె చెరువు సుందరీకరణ పనుల కోసం దాదాపు రూ.3 కోట్ల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. ఇందులో 85 శాతం రాష్ట్ర ప్రభుత్వ నిధులు, 15 శాతం కేంద్ర ప్రభుత్వ నిధులు ఉన్నాయని పేర్కొన్నారు.
చెరువుల అభివృద్ధి, సుందరీకరణతో పాటు పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని, పనులను పూర్తి నాణ్యత ప్రమాణాలతో నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఎమ్మెల్యే ఆదేశించారు.




