Sircilla: సిరిసిల్లలో ఘనంగా పలు గ్రామాల్లో టీఆర్‌ఎస్ పార్టీలోకి చేరికలు!

Sircilla: సిరిసిల్ల నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌లో చేరికలపై ఇతర పార్టీల నాయకులు బెదిరింపులకు పాల్పడటం మానుకోవాలని టీఆర్‌ఎస్ ఇన్‌చార్జ్ మజీద్ హెచ్చరించారు.

KALEEM, SIRICILLA
Published on: 26 Sept 2026 4:23 PM IST
Sircilla
X

Sircilla: సిరిసిల్లలో ఘనంగా పలు గ్రామాల్లో టీఆర్‌ఎస్ పార్టీలోకి చేరికలు!

Sircilla: నియోజకవర్గంలో తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) పార్టీలో ప్రజలు స్వచ్ఛందంగా చేరుతుండగా, వారిని ఇతర పార్టీలకు చెందిన కొంతమంది నాయకులు బెదిరింపులకు గురిచేస్తున్నారని టీఆర్‌ఎస్ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌చార్జ్ మజీద్ ఆరోపించారు. ప్రజలకు నచ్చిన పార్టీలో చేరే హక్కు ఉందని, రాజకీయ పార్టీలో చేరకుండా బెదిరింపులకు పాల్పడటం సరికాదని ఆయన అన్నారు.

శనివారం ఎల్లారెడ్డిపేట మండలంలోని దుమాల, వీర్నపల్లి మండల కేంద్రంతో పాటు బాబాయ్ చెరువు తండా, గర్జనపల్లి గ్రామాల్లో టీఆర్‌ఎస్‌లో చేరికల కార్యక్రమాలు నిర్వహించారు. సిరిసిల్ల నియోజకవర్గ మహిళా ఇన్‌చార్జ్ కదిరే రేణుక, వీర్నపల్లి మండల మహిళా ఇన్‌చార్జ్ పోతారం పద్మ, సల్మాల ముత్తవ్వ ఆధ్వర్యంలో మహిళలు, యువతీ యువకులు పెద్ద సంఖ్యలో పార్టీలో చేరినట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ సందర్భంగా మజీద్ మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌లో స్వచ్ఛందంగా భారీగా చేరికలు జరుగుతుండటంతో ఇతర పార్టీలకు చెందిన కొంతమంది నాయకులు కొత్తగా పార్టీలో చేరిన వారిని బెదిరిస్తున్నారని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌కు చెందిన కొంతమంది నాయకులు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, పెన్షన్లు ఇచ్చామని చెబుతూ టీఆర్‌ఎస్‌లో ఎందుకు చేరుతున్నారని ప్రశ్నిస్తూ బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది నాయకులు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు ఇవ్వమని, ఇళ్లను తొలగిస్తామని, పెన్షన్లు రద్దు చేస్తామని హెచ్చరిస్తున్నారని మజీద్ ఆరోపించారు.

ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, ముస్తాబాద్ మండలాల్లో టీఆర్‌ఎస్ అధినేత కవిత చేస్తున్న ప్రజా సేవకు ప్రజల నుంచి స్పందన వస్తోందని మజీద్ అన్నారు. ప్రజా సమస్యలపై కవిత ఉద్యమాలు చేస్తూ వాటి పరిష్కారం కోసం కృషి చేస్తున్నందువల్లే పార్టీలో చేరికలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు.

ప్రజల రాజకీయ స్వేచ్ఛను గౌరవించాలని, పార్టీలో చేరకుండా బెదిరింపులకు పాల్పడుతున్న నాయకులు ఇప్పటికైనా తమ వైఖరిని మార్చుకోవాలని మజీద్ సూచించారు. లేనిపక్షంలో ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.

ఈ కార్యక్రమాల్లో సిరిసిల్ల నియోజకవర్గ యువజన నాయకుడు సయ్యద్ జావిద్, మార్వాడి దేవరాజు, బండి శ్రీహరి, కోనేటి పర్షయ్య, కొడుముంజ బాబు, మంతారం పద్మ, జంగా రజిత, బానోతు జ్యోతి, కదిరే చరణ్, హరాలే సిద్ధూ తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA