Potkapalli: గణేష్ ఉత్సవాల్లో డీజేలు వేస్తే కఠిన చర్యలు: ఎస్ఐ సనత్ రెడ్డి
Potkapalli: గణేష్ ఉత్సవాల్లో డీజేలపై పూర్తి నిషేధం ఉందని, పోలీస్ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని పొత్కపల్లి ఎస్ఐ సనత్ రెడ్డి హెచ్చరించారు.
Potkapalli: గణేష్ ఉత్సవాల్లో డీజేలు వేస్తే కఠిన చర్యలు: ఎస్ఐ సనత్ రెడ్డి
Potkapalli: గణేష్ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జనం సందర్భంగా మండప నిర్వాహకులు తప్పనిసరిగా పోలీస్ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని పొత్కపల్లి పోలీస్ స్టేషన్ సబ్‌ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (SI) సనత్ రెడ్డి తెలిపారు.
రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు శాంతిభద్రతల పరిరక్షణ కోసం పలు నిబంధనలు జారీ చేసినట్లు పేర్కొన్నారు.
ముఖ్యమైన నిబంధనలు & సూచనలు:
ముందస్తు అనుమతులు:
అనుమతి పొందిన స్థలాల్లోనే మండపాలు వేయాలి. ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకుని స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలి. వివాదాస్పద స్థలాలు, రహదారులకు అడ్డంగా మండపాలు ఏర్పాటు చేయకూడదు.
భద్రతా చర్యలు: మండప వద్ద 24 గంటలూ ఇద్దరు నిర్వాహకులు అందుబాటులో ఉండాలి. తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడంతో పాటు అగ్ని ప్రమాద నివారణకు 3 సంచుల ఇసుక, నీటి డ్రమ్ సిద్ధంగా ఉంచాలి. విద్యుత్ కనెక్షన్లను శాఖాధికారుల పర్యవేక్షణలోనే తీసుకోవాలి.
డీజేలపై పూర్తి నిషేధం: సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఉత్సవాల్లో గానీ, నిమజ్జన ఊరేగింపులో గానీ డీజే సౌండ్ సిస్టమ్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు.
సమయపాలన: రాత్రి 10:00 గంటలలోపే ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు ముగించాలి. నిమజ్జనం రోజున మధ్యాహ్నం 2:00 గంటలకు వాహనం సిద్ధం చేసుకుని, సాయంత్రం 4:00 గంటల నాటికే మండపం నుంచి నిమజ్జనానికి బయలుదేరాలి.
నిషేధిత చర్యలు: మండపాల వద్ద మద్యం సేవించడం, పేకాట ఆడటం చట్టరీత్యా నేరం. శోభాయాత్రలో వాహనాలపై పిల్లలను ఎక్కించరాదని, మత్తులో ఉన్నవారిని ఊరేగింపులోకి అనుమతించవద్దని సూచించారు.
ఇతర మతాల ప్రార్థనా మందిరాల వద్ద ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు లేదా ప్రవర్తన చేయకుండా భక్తి, క్రమశిక్షణతో వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, పోలీసులకు పూర్తి సహకారం అందించాలని ఎస్ఐ కోరారు.




