Sultanabad: సుల్తానాబాద్‌లో శిశుగృహను ప్రారంభించిన కలెక్టర్ కోయ శ్రీ హర్ష!

Sultanabad: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో శిశుగృహను ప్రారంభించిన కలెక్టర్ కోయ శ్రీ హర్ష. అనాథ, పసిపిల్లలకు నాణ్యమైన పోషకాహారం, వసతులు అందించాలని ఆదేశం.

Srimanthula Kondal, Peddapalli
Published on: 2 Nov 2026 1:22 PM IST
Sultanabad
X

Sultanabad: సుల్తానాబాద్‌లో శిశుగృహను ప్రారంభించిన కలెక్టర్ కోయ శ్రీ హర్ష!

Sultanabad: సంరక్షణ, రక్షణ అవసరమైన చిన్నారుల భద్రత, ఆరోగ్యం, సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులకు సూచించారు. శిశుగృహలో పిల్లలకు మెరుగైన సౌకర్యాలు, నాణ్యమైన పోషకాహారం, అవసరమైన వైద్య సదుపాయాలు, తగిన సంరక్షణ అందించాలని ఆదేశించారు.పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లోని బాలసదన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శిశుగృహాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా శిశుగృహలో కల్పించిన సౌకర్యాలను పరిశీలించి, చిన్నారులకు అందించే సంరక్షణ, వసతుల వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, తల్లిదండ్రుల సంరక్షణకు నోచుకోని, వదిలివేయబడిన, అనాథ, సంరక్షణ అవసరమైన పసిపిల్లలకు సురక్షితమైన ఆశ్రయం కల్పించడమే శిశుగృహ ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు. జననం నుంచి ఆరు సంవత్సరాల లోపు వయస్సు గల చిన్నారులకు ప్రేమపూర్వక సంరక్షణ, పోషకాహారం, వైద్య సదుపాయాలు, ఆరోగ్య పరిరక్షణతో పాటు వయస్సుకు తగిన అభివృద్ధి అవకాశాలను ఈ కేంద్రం ద్వారా అందించనున్నట్లు తెలిపారు.

చిన్నారుల భద్రత, ఆరోగ్య పరిరక్షణ విషయంలో నిర్లక్ష్యం వహించకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. పిల్లలకు ఆహ్లాదకరమైన, సురక్షితమైన వాతావరణం కల్పించడంతో పాటు, వారి అవసరాలకు అనుగుణంగా మెరుగైన సదుపాయాలు అందుబాటులో ఉంచాలని అధికారులకు తెలిపారు.

చట్టబద్ధమైన దత్తత ప్రక్రియ ద్వారా కుటుంబ వాతావరణం

శిశుగృహలో సంరక్షణ పొందుతున్న అర్హులైన చిన్నారులకు చట్టబద్ధమైన దత్తత ప్రక్రియ ద్వారా కుటుంబ వాతావరణాన్ని కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం కూడా ఈ కేంద్రం లక్ష్యాలలో భాగమని అధికారులు తెలిపారు. చిన్నారుల భవిష్యత్తుకు భరోసా కల్పించేలా నిబంధనల ప్రకారం అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు, మున్సిపల్ కమిషనర్ రమేష్, సీడీపీఓ అనిత, సీనియర్ అసిస్టెంట్ సత్యనారాయణ, జిల్లా బాలల సంరక్షణ అధికారి జితేందర్, బాలసదన్ సిబ్బంది పాల్గొన్నారు.

Srimanthula Kondal, Peddapalli

Srimanthula Kondal, Peddapalli